ఓసీపీ వరద నీటిపై అధికారుల ఆరా…

దిశ దశ, మంథని:

రామగుండం రీజియన్ లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మట్టి పొలాల్లో మేటలు వేసిన అంశంపై రెవెన్యూ, సింగరేణి అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామంలోని పొలాల్లోకి వరద నీటితో పాటు ఓబి మట్టి కూడా కొట్టుకుంటూ వచ్చి మేటలు వేసింది. దీంతో వరినాట్లు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం సాయంత్రం ‘‘దిశ దశ’’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనాన్ని చదివిన రెవెన్యూ అధికారులు గ్రామ రైతుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం కన్నాల గ్రామానికి చేరుకుని పంటపొలాల్లో వేసిన మట్టి మేటలను పరిశీలించారు. మంథని తహసీల్దార్ రాజయ్య, సింగరేణి అధికారి వెంకటస్వామి పొలాలను పరిశీలించినప్పుడు కన్నాల రైతులు తమకు పరిహారం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే పొలాల్లోకి వరదతో పాటు వచ్చిన మట్టి ఓసీపీకి చెందినది కాదని సింగరేణి అధికారులు వాదించారు. దీంతో రైతులు సింగరేణి అధికారికి వివరిస్తూ… నిలిచిపోయిన నీళ్లలోకి దిగి పరిశీలించాలన్నారు. గతంలో సింగరేణి అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు కూడా తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నాల గ్రామ రైతు గుడిసె గట్టయ్య వివరించారు. చివరకు సింగరేణి అధికారులు రైతులకు పరిహారం అందించే విషయం జీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమకు పరిహారం అందించడంతో పాటు ఓబి మట్టి తమ పొలాల్లోకి రాకుండా కాలువ తవ్వి మళ్లించాలని గ్రామ రైతులు సూచించారు. లేనట్టయితే గ్రామం మీదుగా వెల్లే సింగరేణి లారీలను అడ్డుకుంటామని మరోసారి స్పష్టం చేశారు. 

You cannot copy content of this page