కార్మిక క్షేత్రం TO ధార్మిక క్షేత్రం

దిశ దశ, జగిత్యాల:

కార్మిక క్షేత్రంలో ఎదిగిన ఆ నాయకులు తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు ధార్మిక క్షేత్రం వైపు చూస్తున్నారు. ప్రజా క్షేత్రంలో తమ తలరాతలను పరీక్షించుకునేందుకు నవ నారాసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురిని ఎంచుకున్నారు. కార్మిక క్షేత్రంతో అనుబంధం పెంచుకుని ఎదిగిన ఆ నాయకులు కూడా ఒకే చోట పోటీ చేస్తుండడం విశేషం. వీరిలో ఒకరు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా మిగతా ఇద్దరు సింగరేణి ఉద్యోగుల వారసులు కావడం గమనార్హం.

మేడారం నుండి…

నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మేడారం కేంద్రంగా నియోజకవర్గం ఉండేది. దీని పరిధిలో రామగుండం కార్మిక క్షేత్రం అంతా కూడా ఉండడంతో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నాయకులంతా మేడారం లక్ష్యంగా ఎదిగారు. అయితే డిలిమిటేషన్ తరువాత రామగుండం, ధర్మపురి నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. మేడారం పరిధిలోని కొన్ని మండలాలు, బుగ్గారంలోని మరికొంత ప్రాంతం కలిపి ధర్మపురి నియోజకవర్గంగా ఏర్పడడంతో పాటు ఎస్సీ రిజర్వూ స్థానానికి కెటాయించారు. రామగుండం నియోజకవర్గంలో కార్మిక క్షేత్రంతో పాటు రామగుండం రూరల్ ఏరియా పరిధిని చేర్చారు. దీంతో కార్మిక క్షేత్రంలో ఎదిగిన ఎస్సీ నాయకుల అడుగులు ధర్మపురివైపు సాగాయి. ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుండి కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుండి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొప్పుల చిరకాల ప్రత్యర్థిగా మారిపోయారు. 2009 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా కొప్పుల వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది.

సింగరేణి నేపథ్యమే

ఈ సారి ఇక్కడి నుండి బరిలో నిలుస్తున్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికుడిగా పని చేస్తూ 1983లో ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన కొప్పుల ఈశ్వర్ కోల్ కట్టర్ గా సింగరేణిలో పనిచేస్తూ రాజకీయాలవైపు అడుగులు వేశారు. ముచ్చటగా మూడోసారి కూడా కొప్పుల ఈశ్వర్ ప్రత్యర్థిగా బరిలో నిలుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి పట్టణానికి చెందిన వారు. అయితే ఆయన తండ్రి సింగరేణిలో క్లర్క్ గా ఉద్యోగం చేస్తుడడంతో అడ్లూరి కూడా గోదావరిఖని సింగరేణి ప్రాంతంతో అనుబంధం పెనవేసుకుని ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో పాటు ప్రధాన పార్టీలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎస్ కుమార్ మరోసారి ధర్మపురి నుండి పోటీ చేస్తున్నారు. 2009లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు మళ్లీ ఈ సారి అధిష్టానం అవకాశం కల్పించింది. గతంలో పెద్దపల్లి ఎంపీగా, రామగుండం మునిసిపల్ ఛైర్మన్ గా పోటీ చేశారు. ప్రస్తుతం బీజేపీలో జాతీయ స్థాయి పదవిలో ఉన్న ఎస్ కుమార్ తండ్రి కూడా సింగరేణిలో ఉద్యోగిగా పనిచేసిన వారే కావడం విశేషం.

ఉప కులాల వారిగా…

ఇకపోతే ఈ నియోజకవర్గం నుండి ఎమ్మోల్యేలుగా ఈ సారిలో పోటీ చేస్తున్న వారిలో ఇద్దరు అభ్యర్థులు ఒకే ఉప కులానికి చెందిన వారు కాగా మరోకరు మాత్రం మరో ఉపకులానికి చెందిన వారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ లు ఎస్సీ మాల(మెహర్) సామాజిక వర్గానికి చెందిన వారు కూడా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం ఎస్సీ మాదిగా సామాజిక వర్గానికి చెందిన వారు.

You cannot copy content of this page