దిశ దశ, రామగుండం:
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రం నుండి వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న విషయాన్ని గమనించిన ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాల నుండి వస్తున్న వరద నీరును అంచనా వేసిన అధికారులు ఆదివారం ఉదయం గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు. ఉదయం 5.30 గంటలకు ఐదు గేట్ల ద్వారా 13,650 క్యూసెక్కుల నీటిని వదలగా, 6 గంటలకు 35 వేల క్యూసెక్కులకు పెంచారు. 7 గంటలకు 65 వేల క్యూసెక్కుల నీటిని 16 గేట్ల ద్వారా దిగువకు వదిలారు. 7.30 గంటలకు లక్షా 7 వేల 500 క్యూసెక్కులు, 9.30 గంటలకు 136714 క్యూసెక్కుల మేర నీటిని గోదావరి దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అలాగే ఎల్లంపల్లి బ్యారేజీ మీదుగా వాహనాల రాకపోకలను కూడా నిషేధిస్తున్నామని ఈఈ జి స్వామి తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నట్టుగా వెల్లడించారు.