భద్రాద్రి వద్ద మూడో హెచ్చరికకు సిద్దం
దిశ దశ, దండకారణ్యం:
తగ్గినట్టే తగ్గిన గోదావరికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికతోనే సరిపెట్టిందన్న సంతోషం గంటల పాటు కూడా మిగల్చకుండా మళ్లీ గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. గంటల వ్యవధిలోనే రెండో ప్రమాద హెచ్చరిక చేయాల్సినంత వరద నీరు భద్రాద్రి గోదారమ్మ ఒడిలో వచ్చి చేరుతోంది. క్షణ క్షణం భయం భయంగా పరివాహక ప్రాంత గ్రామాలు జీవనం సాగిస్తుండగా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా భద్రాద్రి గోదావరి పరివాహక ప్రాంతంలో హై అలెర్ట్ గా విధుల్లో నిమగ్నం అయింది. బుధవారం మద్యాహ్నానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు రాత్రి 10 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద పోటు ఇలాగే కొనసాగితే మరి కొన్ని గంటల్లోనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి ఉంటుందని అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ప్రస్తుతం భద్రాద్రి వద్ద గోదావరి 50.20 అడుగుల నీటి మట్టం వచ్చి చేరగా మరో మూడు అడుగులు పెరిగినట్టయితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. 12,65,653 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నప్పటికీ ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు పెద్ద ఎత్తున వస్తుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భద్రాద్రికి ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుండే దాదాపు 17.50 లక్షల క్యూసెక్కుల నీరు భద్రాద్రి వద్ద గోదావరి నదిలో వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు గేట్లు బుధవారం రాత్రి అధికారులు ఎత్తడంతో దిగువ ప్రాంతాలన్ని జలమయం అవుతున్నాయి. బుధవారం సాయంత్రం నుండే భద్రాచలం ఏజెన్సీ ఏరియాల్లో మోహరించిన అధికారులు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరించారు. చర్ల మండలంలోని పలు గ్రామాలో గోదావరి వరద భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తుండగా, దండుపేట గ్రామంలోని 40 కుటుంబాలను అధికారులు బుధవారం రాత్రి ఖాలీ చేయించి పునారావస కేంద్రానికి తరలించారు. అలాగే కొత్తపల్లి, గొంపల్లి, వీరాపురంతో పాటు పరివాహక గ్రామాల జనం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
ఒకరి గల్లంతు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం చాపరాలపల్లి వద్ద కుమ్మరి వాగు దాటుతుండగా తల్లీ కూతుర్లు వరద నీటికి కొట్టుకపోయారు. వారితో పాటు వాగు దాటుతున్న వారు వారిని కాపాడే ప్రయత్నం చేయగా ఒకరు ప్రాణాలతో బయట పడగా మరోకరు గల్లంతయ్యారు. వీరంతా వ్యవసాయ కూలీ పనులకు వెల్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతయిన మహిళ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.