తలపండిన నేతతో తలపడనున్న ప్రత్యర్థులు

జగిత్యాల ఎన్నికల తీరు

దిశ దశ, జగిత్యాల:

ఆ నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఆ నేత పేరు గుర్తుకు వస్తుంది. ఆ నాయకుడి పేరు చెప్పినా ఆ నియజకవర్గం పేరు ఠక్కున చెప్పేస్తారు. తెలుగు రాష్ట్రాలలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆ సీనియర్ నేత మరో సారి ప్రజా క్షేత్రంలో తన బలం ఏంటో నిరూపించుకునేందుకు సిద్దమయ్యారు. అయితే ఆ తల పండిన నేతకు వ్యతిరేకంగా ఉన్న వారంతా కూడా ఒకప్పుడు ఆయన ప్రత్యర్థులే కావడం విశేషం. ప్రజా చైతన్యానికి కేరాఫ్ గా నిలిచే జగిత్యాల నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు ఏంటంటే..?

సీనియర్ లీడర్…

1983 నుండి వరసగా చట్ట సభలకు పోటీ చేస్తున్న ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్న నేత తాటిపర్తి జీవన్ రెడ్డి. టీడీపీ ఆవిర్భావంతో 1983లో ఎమ్మెల్యేగా గెలిచి ఫస్ట్ టైంలోనే ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారయన. 1985తో అనూహ్యంగా ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా జి రాజేశం గౌడ్ కు కెటాయించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1989 ఎన్నికల్లో గెల్చిన జీవన్ రెడ్డి 1994లో ఎల్ రమణ చేతిలో ఓటమి పాలయ్యారు. 1996 ఉప ఎన్నికలప్పటి నుండి 2004 వరకు గెలిచిన జీవన్ రెడ్డి 2009 ఎన్నికల్లో మరోసారి ఎల్ రమణ చేతిలో ఓడిపాగా 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2018 ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ చేతిలో ఓటమి చవి చూశారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఉద్యమ నేత కేసీఆర్ పై పోటీ చేసిన జీవన్ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన జగిత్యాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ప్రత్యర్ధులంతా అటువైపు…

అయితే ఈ ఎన్నికల్లో మాత్రం జీవన్ రెడ్డి వైవిద్యమనే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ నేత గెలుపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు ఘంటా పథంగా చెప్పుకుంటున్న తరుణంలో అక్కడ నెలకొన్న పరిస్థితులు మాత్రం గమ్మత్తుగా మారిపోయాయి. ఒకప్పుడు ఆయనపై పోటీ చేసిన నాయకులంతా కూడా ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. 1985లో జగిత్యాల నుండి ప్రాతినిథ్యం వహించిన జి రాజేశం గౌడ్, ఆయన్ని రెండు సార్లు ఓడించిన రికార్డు సొంతం చేసుకున్న ఎల్ రమణలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ సారి జీవన్ రెడ్డిపై పోటీ చేస్తున్న డాక్టర్ సంజయ్ గెలుపునకు వీరంతా కూడా సీరియస్ గా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా జగిత్యాలపై ప్రత్యేకంగా కన్నేశారని చెప్పాలి. 2018 ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమిలో కీలక పాత్ర వహించిన కవిత పై జీవన్ రెడ్డి ఏడాది తిరగకముందే రివైంజ్ తీసుకున్నారని ప్రచారంలో ఉంది. 2019 ఎంపీ ఎన్నికల సమయంలో కవిత ఓటమిలో జీవన్ రెడ్డి పాత్ర ఉందని ఇందుకు ప్రతికారం తీర్చుకునే దిశగా ఆమె పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. దీంతో జీవన్ రెడ్డి ఓటమి కోసం అధికార బీఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పటి ప్రత్యర్థులు, రాజకీయ వైరుధ్యం ఉన్న వారంతా కూడా ఒకే పార్టీలో కొనసాగుతుండడంతో జీవన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా వీరంతా పనిచేస్తారన్న అంచనాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి మాత్రం ఒంటరి పోరు చేయాల్సి ఉందని స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page