జగిత్యాలలో ఇద్దరి దుర్మరణం
దిశ దశ, జగిత్యాల:
పదినిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వారిని విధి వెంటాడింది. వివాహానికి హాజరై ఇంటికి చేరుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం వారిని కబలించింది. తెల్లావారే సరికి గమ్యం చేరుతారనుకున్న వారిని ఆర్టీసీ బస్సు రూపంలో బలి తీసుకుంది. జగిత్యాల శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్టణంలో విషాదాన్ని నింపింది. సుంఘటన వివరాల్లోకి వెల్తే… ఆదివారం తెల్లవారు జామున కరీంనగర్- జగిత్యాల రహదారిలోని ధరూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కారును ఢీకొట్టడం కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా డ్రైవింగ్ చేస్తున్న సంకీర్త్ అనే యువకుడు, అతనితో పాటు ముందు సీట్లో ప్రయాణిస్తున్న యువతి మృత్యువాత పడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న రాయమల్లు, ఆయన భార్యకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంకీర్త్ ఆయన తల్లిదండ్రులతో కలిసి జనగామ కు పెళ్లి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జగిత్యాల పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన యువతి వారి బంధువుల అమ్మాయని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు ముందు టైరు ఊడిపోయి ఉండడంతో ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. యాక్సెల్ రాడ్ విరగిందా లేక టైరు ఊడిపోవడం వల్ల ప్రమాదం సంభవించిందా అన్న విషయంపై కూడా తెలుసుకుంటున్నారు. ప్రమాదం కారణంగానే బస్సు టైర్ ఊడిపోయిందా అన్న విషయంపై స్పష్టత రావలసి ఉంది.