బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం
దిశ దశ, భూపాలపల్లి:
తూర్పు అటవీ ప్రాంతంలోకి రాబరీ గ్యాంగ్స్ ఎంట్రీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇంతకాలం చిల్లర మల్లర దొంగతనాలు మాత్రమే చోటు చేసుకునే ఈ ప్రాంతంలో ఏకంగా బ్యంక్ దోపిడీకి విఫలయత్నం చేయడం కలకలం సృష్టిస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జిల్లాలోని మల్హర్ మండలం కొయ్యూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ లో దోపిడీ చేసేందుకు ఓ ముఠా ప్రయత్నించి విఫలం అయింది. బ్యాంకు పక్కనే ఉన్న చిన్న గేటును కట్టర్ తో కోసి లోపలకు చొరబడ్డ దోపీడీ ముఠా కిటీకీలను కట్ చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో వెనుదిరిగినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లనప్పటికీ మారుమూల ప్రాంతంలో కూడా రాబరీ గ్యాంగ్స్ తిరగడం సంచలనం కల్గిస్తోంది. అయితే స్థానికంగా ఉన్న ఓ వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ ను ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నప్పటికీ గత అనుభవాలను కూడా నెమరువేసుకోవల్సిన పరిస్థితి ఉంది. గతంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగా స్టేట్ బ్యాంక్ లోనూ ఇదే తరహా చోరీకి పాల్పడిన తరువాత పోలీసులు ఈ ముఠాను గుర్తించేందుకు మహారాష్ట్రకు వెల్లి ఆరా తీయగా ఈ ముఠా గుట్టు రట్టయింది. ఇలాంటి గ్యాంగ్ ఏదైన ఈ ప్రాంతంలోకి వచ్చి రెక్కి నిర్వహించుకుని ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే బ్యాంకు రాబరీకి విఫల యత్నం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నిందితుల ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. క్లూస్ టీం ద్వారా వేలి ముద్రలను సేకరించడంతో పాటు సీసీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఇతరాత్ర సాంకేతికతను అందిపుచ్చుకుని నిందితుల వివరాలను రాబట్టే పనిలో పడ్డారు స్థానిక పోలీసులు.
మంగళవారమేనా..?
అయితే బ్యాంకు రాబరీ మంగళవారం జరిగి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బుధవారం ఉగాది సెలవు దినం కాబట్టి వెలుగులోకి రాలేదని గురువారం ఉదయం బ్యాంకు సిబ్బంది డ్యూటీలో చేరినప్పుడు బ్యాంక్ రాబరీకి విఫలయత్నం గురించి బయట పడి ఉంటుందని భావిస్తున్నారు.
సెక్యూరిటీ..?
అయితే నిత్యం ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకుల వద్ద సెక్యూరిటీ లేకపోవడం కూడా ఓ మైనస్ గా భావిస్తున్నారు. సెక్యూరిటీ ఉన్నట్టయితే వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుదని అంటున్న వారూ లేకపోలేదు. బ్యాంకులో స్ట్రాంగ్ రూం ఉన్నా లేకున్నా సెలవు దినాల్లో సంరక్షించేందుకు బ్యాంక్ పరంగా సెక్యరిటీనో లేక వాచ్ మెన్ నో నియమించుకునే విధానం అమలు చేస్తే బావుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వినియోగదారుల సేవలను విస్తరించుకునేందుకు గ్రామ గ్రామాణ ఏర్పాటు చేస్తున్న గ్రామీణ బ్యాంకుల్లో స్వీయ రక్షణ చర్యలు కూడా ముఖ్యమేనన్న విషయాన్ని విస్మరించకపోతే బావుంటుందని అంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికి దోపీడీ గ్యాంగ్ మాత్రం వెనకడుగు వేయకుండా చోరీలకు పాల్పడుతున్నందున సెక్యూరిటీ అవసరమన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. అలాగే గతంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి బ్యాంక్ రాబరీ చేసినప్పుడు సీసీ ఫుటేజీకి సంబంధించిన డీవీఆర్ బాక్సు అనుకుని టెర్రరిస్టులు యూపీఎస్ ను ఎత్తుకెళ్లారు. మరో వైపున గుంజపడుగ బ్యాంక్ రాబరీ తరువాత డీవీఆర్ బాక్సును ఎత్తుకెళ్లినప్పటికీ దొంగల ముఠా చేతుల్లోంచి సమీప తుమ్మ చెట్లలో ఈ బాక్స్ పడిపోయింది. లేనట్టయితే ఈ బ్యాంకు రాబరీ ముఠా గురుంచి అంత తొందరగా వెలుగులోకి వచ్చేది కాదు.