దిశ దశ, గోదావరిఖని:
కార్మిక క్షేత్రంలోకి మళ్లీ గ్యాస్ కట్టర్ గ్యాంగ్ లు చొరబడ్డాయా..? రెండు ఏటీఎంలలో నగదు ఎత్తుకెళ్లిన దొంగల తీరు గమనిస్తే ఇదే నిజమనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖని పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి రెండు ఏటీఎంలలో చోరీ జరిగింది. ఈ ఘటనలకు పాల్పడిన అగంతకులు ఏటీఎం మిషన్లను కట్ చేసి వాటిలో ఉన్న నగదును ఎత్తుకెళ్లి పోయారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయడం ఆరంభించారు. గతంలో కూడా గోదావరిఖని, మంథని రహదారిలోని గుంజపడుగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో చోరీ చేశారు దుండగులు. మహారాష్ట్రలోని చంద్రపూర్ కేంద్రంగా వీరు దోపిడీకి అనుకూలంగా ఉన్న బ్యాంకులను, ఏటీఎంలను గుర్తించి చోరీలకు పాల్పడిన గ్యాంగ్ ఈ ప్రాంతంలోనూ సంచరించి దోపీడీకి పాల్పడింది. అప్పుడు బ్యాంకు వెనక ప్రాంతంలోని చెట్లను నరికి నిచ్చనలా తయారు చేసుకుని బ్యాంకులోకి చొరబడగానే స్ట్రాంగ్ రూంకు సరఫరా అయ్యే విద్యుత్ వైర్లను, సీసీ కెమరా రికార్డింగ్ విధానాన్ని నిలిపివేశారు. ఆ తరువాత గ్యాస్ కట్టర్ ద్వారా స్ట్రాంగ్ రూంను పగలగొట్టి అందులోని నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. అయితే అగంతకులు అక్కడి నుండి వెల్లిపోయేప్పుడు బ్యాట్రీ అనుకుని డీవీఆర్ బాక్స్ ను తుమ్మ చెట్లలో పడేసి వెల్లారు. అంతేకాకుండా పోలీసులు కూడా ఈ ఘటనకు ముందు ఈ ప్రాంతంలో తిరిగిన వాహనాలను గుర్తించేందుకు సీసీ ఫుటేజీని ఆధారం చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితలను ఆచూకి దొరకబట్టిన రామగుండం పోలీసులు చంద్రపూర్ కు చెందిన కొందరిని, ఉత్తరప్రదేశ్ కు చెందిన మరికొందరిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత తిరిగి గ్యాస్ కట్టర్లను ఉపయోగించి దోపిడీకి పాల్పడిన ఘటన ఈ ప్రాంతంలో ఇదే కావడం గమనార్హం. దీంతో మళ్లీ గ్యాస్ కట్టర్లను ఉపయోగించి చోరీలకు పాల్పేడే గ్యాంగ్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోకి వచ్చి ఉంటుందన్న అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గుంజపడుగ గ్యాంగ్ కు తాజాగా చోరీలకు పాల్పడిన గ్యాంగ్ కు సంబంధం ఉన్నా లేకున్నా, అప్పుడు వారు అలాగే గ్యాస్ కట్టర్లను ఉపయోగించి స్ట్రాంగ్ రూం డోర్లను కట్ చేశారు. అలాగే చంద్రపూర్ ప్రాంతంలో కూడా ఏటీఎంలను ఇదేవిధంగా దోపీడికి పాల్పడ్డారు. అప్పటి ఘటనలు, ఇప్పటి ఘటనలు ఒకేరకంగా దోపిడీలు చేయడం మాత్రం ఆలోచించాల్సిన విషయం. ఈ సారి దొంగతనాలకు పాల్పడిన అగంతకులు సీసీ కెమెరాలో తమ ఉనికి రికార్డు కాకూడదని స్ప్రే చేసి మరీ చోరీకి పాల్పడడాన్ని బట్టి చూస్తే మాత్రం పర్ ఫెక్ట్ స్కెచ్ తోనే చేసినట్టుగా స్పష్టం అవుతోంది.