దిశ దశ, కరీంనగర్:
బీఆర్ఎస్ కార్పోరేటర్ జంగిలి సాగర్ పై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్టు కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ పోలీసులు ప్రకటించారు. రిటైర్డ్ టీచర్ కు చెందిన భూమిని సేఫ్ గా ఉంచాలంటే రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సాగర్ ఆ రహదారి మధ్యలోంచి రోడ్డును కూడా వేయించాడు. దీంతో సదరు భూమి యజమాని సాగర్ తో రాజీ కుదుర్చుకునేందుకు తలొగ్గాల్సి వచ్చింది. ఈ క్రమంలో సదరు రిటైర్డ్ ఉపాధ్యాయుని నుండి రూ. 10 లక్షలకు ఒప్పందం కాగా అందులో రూ. 2 లక్షలు అతని కూతురు అకౌంట్ కు బదిలీ చేసిన బాధితుడు మిగతా రూ. 8 లక్షలు నేరుగా ఇచ్చానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాగర్ డబ్బు డిమాండ్ చేసినప్పటి వీడియో కూడా పోలీసులకు బాధితుడు అందజేశారు. ఈ క్రమంలో సాగర్ ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది. అయితే పలు ఆరోపణలు ఎదుర్కొన్న సాగర్ పై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. జంగిలి సాగర్ పై క్రైం నంబర్ 515/2011లో సెక్షన్ 447, 186 r/w 34 ఐపీసీ, క్రైం నంబర్ 90/2022లో సెక్షన్
427, 290, 324 r/w 34 IPC, క్రైం నంబర్ 164/2023 సెక్షన్ 147, 148, 452, 427 r/w 149 IPC, క్రైం నంబర్ 31/2024, సెక్షన్ 447, 427, 386, 506 IPC, క్రైం నంబర్ 35/2024, సెక్షన్ 386, 506 IPCలలో కేసు నమోదు అయ్యాయని పోలీసులు తెలిపారు. పోలీస్ మాన్యూవల్ నెం.600-1 ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కర్ణాకర్ రావు తెలిపారు.