సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు… ఇద్దరి అరెస్ట్…
దిశ దశ, హైదరాబాద్:
ఆర్థిక నేరగాళ్లు అందినకాడికి దోచుకునేందుకు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇటీవల ముంబాయి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కరీంనగర్ కు చెందిన పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే విధానంతో జరిగిన మరో స్కాంను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. షంషీర్గంజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కేంద్రంగా రూ. 175 కోట్ల మేర లావాదవీలను గుర్తించింది. దీంతో దర్యాప్తును మరింత లోతుగా చేపట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూర్ అధికారులను ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్‌కు చెందిన మహ్మద్ షూబ్ తౌకీర్ (34), మొఘల్‌పురాకు చెందిన మహమూద్ బిన్ అహ్మద్ బవాజీర్ (45)లను అరెస్ట్ చేశారు. వీరు ఆరు కరెంట్ అకౌంట్స్ ద్వారా కేవలం రెండు నెలల కాలంలో రూ. 175 కోట్ల మేర లావాదేవీలకు పాల్పడ్డారని తేల్చారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) డాటా విశ్లేషణ ద్వారా సేకరించిన ఆధారాలను బేస్ చేసుకున్న పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చి, ఎప్రిల్ నెలల్లోనే రూ. 175 కోట్ల మేర లావాదేవీలు జరగడంతో అనుమానించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సమగ్ర విచారణ జరిపారు. 28/2024 IT చట్టంలోని సెక్షన్ 66D మరియు సెక్షన్లు 318(4), 319(2), 338 BNS చట్టాల ప్రకారం చేసు నమోదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో DSP K. V. M. ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం టెక్నికల్ టీమ్ డాటా విశ్లేషణ చేసిందని చెప్పారు. ఈ ఆరు బ్యాంకు అకౌంట్లకు 600 ఫిర్యాదులు వచ్చినట్టుగా వివరించారు. దుబాయ్ కేంద్రంగా క్రిప్టో కరెన్స్ వ్యాపారం సాగుతోందని కూడా గుర్తించామని తెలిపారు. దుబాయ్ కి చెందిన క్రిప్టో కరెన్సీ డాన్ కు చెందిన ఐదుగురు ముఖ్య అనుయరుల ద్వారా పేదలచే అకౌంట్లు ఓపెన్ చేయించారని, వీరికి కమిషన్ ఇస్తుంటారన్నారు. బ్యాంకులో అకౌంట్లు తెరిచిన తరువాత డబ్బులు డ్రా చేసుకునేందుకు ముందుగానే వారిచే చెక్కులపై సంతకాలు చేయించుకుంటారని, అక్కడ డ్రా చేసిన డబ్డును హవాలా ద్వారా విదేశాలకు పంపిస్తారని పోలీసుల విచారణలో తేలింది. బ్యాంకు ఖాతాలు తెరవడం, ఇందుకు అవసరమైన డాక్యూమెంట్లను తయారు చేయడంలో షూబ్ కీలక పాత్ర పోషించాడు.
గత నెలలో కరీంనగర్ లో…
ఇదే తరహాలో కరీంనగర్ కేంద్రంగా కూడా ఓ స్కాం వెలుగులోకి వచ్చింది. గత జులై 11న ముంబాయి సైబర్ సెల్ క్రైం బ్రాంచ్ ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు అయింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురి కోసం కరీంనగర్ చేరుకున్న ముంబాయి పోలీసులు రెండు రోజులు పాటు కరీంనగర్ లో ఉండి ఒకరిని అరెస్ట్ చేశారు. మందాని ఇంపాడ్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వహిస్తున్నట్టుగా ఓ మహిళ పేరిట కరీంనగర్ లోని బ్యాంకులో ఖాతా ఓపెన్ చేశారు. అయితే ఈ అకౌంట్ ద్వారా జరుగుతున్న లావాదేవీలను గమనించిన బ్యాంకు మేనేజర్ సదరు ఖాతాదారుకు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఆమెకు మాయమాటలు చెప్పిన మరో ఇద్దరు వ్యక్తులు అలాగే లావాదేవీలు కొనసాగించారు. ఈ వ్యవహారంపై ముంబాయిలో ఫిర్యాదు రావడంతో వారు కరీంనగర్ కు వచ్చి నిందితుల కోసం సెర్చింగ్ చేశారు.
తాజాగా హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా ఇదే తరహాలో జరిగిన అక్రమ లావాదేవీలను గుర్తించారు. ఈ రెండు ఘటనలను గమనించినట్టయితే అమాయకుల పేరిట అకౌంట్లు ఓపెన్ చేసి క్రిప్టో కరెన్సీ దందాను కొనసాగిస్తున్న ముఠాలు మరిన్ని కూడా రాష్ట్రంలో ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.