బెహెన్ జీకి సంబంధం లేకుండానే..? పొత్తుపై ఆర్ఎస్పీ నిర్ణయంపై చర్చ

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ రాజకీయాల్లో ఐదు రోజుల క్రితం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రభావితం చేయాలనుకున్న ఆ రెండు పార్టీల నాయకుల నిర్ణయానికి బ్రేకులు పడ్డట్టయింది. సంచలనంగా మారిన పొత్తుల ఎత్తుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారోనన్న చర్చ తీవ్రంగా సాగుతున్న సమయంలో మాయావతి ఇచ్చిన ఝలక్ మరో మలుపు తిప్పింది.

ఆర్ఎస్పీ సొంత నిర్ణయమా..?

ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లు సుదీర్ఘంగా చర్చించి వచ్చే లోకసభ ఎన్నికల్లో కలిసి పోటి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు అంశాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఇద్దరు ముఖ్య నాయకులు ప్రకటించారు. దీంతో అటు బహుజన వాదం ఇటు బీఆర్ఎస్ నినాదం కలిస్తే కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని భావించారంత. కానీ బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ట్విట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. దేశ వ్యాప్తంగా బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పడంతో పాటు ధర్డ్ ఫ్రంట్ కూడా లేదని మయావతి కుండబద్దలు కొట్టారు. తెలంగాణాలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులపై ప్రకటన వెలువడిన నాలుగు రోజుల్లోనే మాయావతి ట్విట్ చేయడంతో ఇక ఇక్కడ కూడా ఎలాంటి పొత్తులకు తావు లేదని స్ఫష్టం అయింది. అయితే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తుల అంశంపై నిర్ణయం తీసుకునేప్పుడు మాయవతి దృష్టికి తీసుకెళ్లారా లేదా అన్న చర్చ మొదలైంది. పొత్తుపై ప్రకటన చేసినప్పుడు మాత్రం ఆర్ఎస్పీ మాట్లాడుతూ… బెహన్ జీ ఆశీర్వాదాలతో అనడంతో తెలంగాణ పొత్తులకు ఆమె క్లియరెన్స్ ఇచ్చారనుకున్నారు. కానీ మాయవతి మాత్రం ఎలాంటి పొత్తులకు తావు లేదని కుండబద్దలు కొట్టిన తరువాత ఆర్ఎస్పీ సొంతగా ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక మాయావతి నిర్ణయం మార్చుకున్నారా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. జాతీయ పార్టీ అయినందున సమీకరణాలు కూడా అదే స్థాయిలో చేయాల్సి ఉంటుందని అంటున్న వారూ లేకపోలేదు. అయితే గతంలో ఏనాడు లేని విధంగా రాష్ట్రంలో బీఎస్పీకి క్రేజీ తీసుకొచ్చిన ఆర్ఎస్పీ కూడా పొత్తులపై ఒకటికి రెండు సార్లు ఆలోచించి, అధిష్టానంతో చర్చించినట్టయితే ప్రతికూల ప్రకటన రాకపోయేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రవీణ్ కుమార్ అధిష్టానంతో మాట్లాడకుండా పొత్తులపై చర్చలు జరిపేందుకు సాహసిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అధినేత్రి మాయావతినే అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటన్నదే పజిల్ గా మారిపోయింది రాజకీయ వర్గాల్లో.

రెండు పార్టీలకూ…

అయితే రాష్ట్రంలో పొత్తులపై ప్రకటన చేసిన తరువాత రెండు పార్టీలు కూడా కొంతమేర వ్యతిరేకతను మాత్రం మూటగట్టుకున్నాయి. బీఎస్పీతో పొత్తును స్వాగతించలేకపోయిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏకంగా పార్టీకే రాజీనామా చేయగా, మరికొంతమంది నాయకులు కూడా మల్లగుల్లాలు పడుతున్నారన్న ప్రచారం జరిగింది. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ తీసుకున్న నిర్ణయంపై కూడా వివిధ వర్గాల నుండి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత్రే పొత్తులు లేవని స్ఫష్టం చేయడంతో ఆయన తీసుకున్న నిర్ణయం తప్పని బాహాటంగానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కొన్ని లోకసభ స్థానాల్లో అవగాహనతో కూడిన పోటీ చేయాలని ఇరుపార్టీల ముఖ్య నాయకులు ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్నది తేలాల్సి ఉంది.

You cannot copy content of this page