పరారీలో ఉన్నా వేటాడి పట్టుకుంటున్నారు… అక్రమాలకు పాల్పడితే అంతే సంగతులు…

ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతిరావు అరెస్ట్

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పోలీసుల వేట యథావిధిగా కొనసాగుతూనే ఉంది. అక్రమార్కులను వేటాడి పట్టుకోవడం లోనూ వెనకాడడం లేదు. ఫిర్యాదు వస్తే చాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. తాజాగా మంగళవారం కరీంనగర్ కు చెందిన ఆర్టీఏ మెంబర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు అత్యంత ఆత్మీయుడిగా ప్రచారం చేసుకున్న తోట శ్రీపతి రావును అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ లోని వివేకానందపురి కాలనీకి చెందిన అనుమండ్ల రవిందర్ (49) 2014లో తీగలగుట్టపల్లిలోని కార్మికేయ నగర్ రోడ్ నంబర్ 16లో 233/Eలో 144 చదరపెు గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ ప్లాట్ లో ఇంటి నిర్మాణం కోసం మునిసిపాలిటీ నుండి పర్మిషన్ తీసుకుని రవిందర్ నిర్మాణం చేపట్టాడు. కొంతవరకు బేస్మెంట్ నిర్మించడంతో పాటు బోరు కూడా వేసుకోగా గత నెల 10వ తేది 10.30 గంటల ప్రాంతంలో సుమారు 12 మంది గుర్తు తెలియని వ్యక్తలు చొరబడి నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 8 పిల్లర్లు, నీటి సంపులను ధ్వంసం చేయడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించే సామాగ్రిని కూడా నాశనం చేశారు. అగంతకులు చేసిన విధ్వంసం కారణంగా రూ. 4 లక్షల రూపాయల మేర ఆస్థి నష్టం వాటిల్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ సైట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా సేకరించిన కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ విచారణ జరపారు. ఈ విచారణలో కరీంనగర్ చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటున్న తోట శ్రీపతి రావు (50), పొన్నాల కనుకయ్య, పవన్, సిరిపురం వెంకట రాజుతో పాటు మరికొంతమందిని ఇంటి నిర్మాణం కూల్చేందుకు పురమాయించాడని నిర్దారించారు. దీంతో పోలీసులు సెక్షన్ 447, 427, 120(b) r/w 34 of IPC కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు శ్రీపతి రావు పరారీ ఉండగా స్పెషల్ టీంను రంగంలోకి దింపి అతని ఆచూకి కోసం ఆరా తీశారు. నిందితుడు శ్రీపతి రావు హైదరాబాద్ లోని అంబర్ పేటలోని తన సోదరుని నివాసంలో షెల్టర్ తీసుకున్నట్టు గుర్తించిన స్పెషల్ టీం పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని కరీంనగర్ కు తరలించారు. నిందితుడిని కరీంనగర్ జిల్లా అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ తెలిపారు.

You cannot copy content of this page