రూటు మార్చిన ఆర్టీసీ…

ప్రజా రవాణే కాదు.. ప్రజా అవసరాలు కూడా…

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త అడుగులు వేస్తోంది. ఒక్కో రంగంలో వైవిద్యతను కనబరుస్తున్న సంస్థ ఇప్పుడు తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో నిమగ్నం అయినట్టు స్పష్టం అవుతోంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తరువాత తీసుకుంటున్న నిర్ణయాలు సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతకాలం గిరిగీసుకుని ముందుకు సాగిన సంస్థ ఇఫ్పుడు బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ప్రజా రవాణాతోనే సరిపెట్టుకోవడం కాకుండా కార్గో సర్వీసెస్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతి వెంకన్న దర్శనానికి వెల్లే భక్తులు వారం రోజుల ముందు టికెట్ రిజర్వు చేసుకుంటే దర్శనం టికెట్ అందుబాటులో ఉంచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆర్టీసీ ఇప్పుడు తాజాగా డ్రింకింగ్ వాటర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ‘జీవా’ బ్రాండ్ పేరిట స్టార్ట్ చేసిన డ్రింకింగ్ వాటర్ సోమవారం నుండి మార్కెట్ లో అందుబాటులో ఉండనున్నాయి.

90 లక్షల లీటర్లు…

జీవా బ్రాండ్ ద్వారా ఏటా 90 లక్షల లీటర్ల నీటిని వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిత్యం 33 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్న 9 వేల బస్సుల ద్వారా 30 లక్షల మంది ప్రజలను గమ్య స్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అమ్మకాలతో తమ మార్క్ బిజినెస్ చేయాలని లక్ష్యం పెట్టుకుంది. సంస్థలో పని చేస్తున్న 50 వేల మందిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో కేవలం ప్రజా రవాణతో సరిపెట్టకుండా వ్యాపారాన్ని కొంతపుంతల్లో నడిపించాలని భావించింది.

భారీ కసరత్తు…

ఒక్క వాటర్ బాటిళ్ల పేరిట ఏటా తెలంగాణ ఆర్టీసీ రూ. 6 కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని గమనించిన ఎండీ సజ్జనార్ సంస్థే వాటర్ బాటిల్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై సమగ్రంగా ఆరా తీసి ఈ నిర్ణయం తీసుకున్నారు. టికెట్ల ద్వారా 96 శాతం రెవెన్యూ వస్తోందని, ఆక్యూపెన్సీ రేట్ కూడా గతంతో పోలిస్తే పెరిగిందని ఎండీ సజ్జనార్ చెప్పారు. ప్రత్యామ్నాయ పద్దతుల్లో కూడా సంస్థ ఆదాయాన్ని పెంచినట్టయితే సంస్థ లాభాల బాటలో పడుతుందన్న భావనతోనే జీవా వాటర్ బాటిల్స్ మార్కెట్లోకి విడుదల చేసినట్టు వివరించారు. కార్గోతో మూడేళ్లలో రూ. 200 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ గడించినట్టు కూడా ఆయన వివరించారు.

గ్రాండ్ లాంఛింగ్

సోమవారం హైదరాబాద్ ఎంజీబీఎస్ లో జీవా వాటర్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, రోడ్లు, భ‌వ‌నాల శాఖ కార్య‌ద‌ర్శి కె.ఎస్‌. శ్రీనివాస‌రాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 వేల మందితో విస్తరించిన ఆర్టీసీ కుటుంబాన్ని కాపాడుకునేందుకు వినూత్న ప్రయత్నాలకు శ్రీకారం చుట్టామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సంస్థను మూసి వేసే ఆలోచనలో లేమని కూడా స్పష్టం చేశారు.

బస్ స్టేషన్లలోనూ..?

ఇక నుండి ఆర్టీసీ బస్ స్టేషన్లలో కూడా జీవా బ్రాండ్ వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంచేందుకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజా రవాణా తీవ్రంగా ఉండే పెద్ద బస్ స్టేషన్ లలో ప్రయాణీకులకు జీవా వాటర్ ను అందుబాటులో ఉంచడం వల్ల మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల మరింత టర్నోవర్ పెరగనుందని, త్వరలో 250 ఎంఎల్, 500 ఎంఎల్ వాటర్ బాటిల్స్ ను కూడా తయారు చేసేందుకు రంగం సిద్దం చేసింది ఆర్టీసీ యాజమాన్యం.

You cannot copy content of this page