తెలంగాణాలో కాలుష్య రహిత ఎలక్ట్రిక్ చార్జింగ్ బస్సులు… ఈ బస్సుల స్పెషాలిటీ ఇదే…

వాటి స్పెషాలిటీ ఏంటంటే..?

దిశ దశ, కరీంనగర్:

కాలుష్య రహిత సమాజం కోసం తెలంగాణ ఆర్టీసీ తనవంతు బాధ్యతలను ఆచరణలో చూపిస్తోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా బస్సులను కొనుగోలు ప్రక్రియపై దృష్టి సారించింది. ఆదివారం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ప్రత్యేకతలివే…

రాష్ట్రంలోని రోడ్లపై తొలిసారిగా పరిగెత్తనున్నఎలక్ట్రిక్ ఛార్జింగ్ ద్వారా నడవనున్నాయి. 35 బస్సులు నేటి నుండి తెలంగాణాలోని వివిధ ప్రాంతాల ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చనున్నాయి. త్వరలో మరో 39 బస్సులను కూడా వినియోగంలోకి తీసుకరానుంది టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం. కేవలం రెండున్నర గంటల పాటు ఛార్జింగ్ చేస్తే చాలు 300 కిలోమీటర్ల మేర ఈ బస్సులు ప్రయాణించనున్నాయి. బస్సుల ఛార్జింగ్ కేంద్రాలను కూడా ఆయా ఆర్టీసీ డిపోల్లో సిద్దం చేశారు. 12 మీటర్ల పొడవుగల ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు హైటెక్ హంగులు సంతరించుకుని రూపుదిద్దుకున్నాయి. 41 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సుల్లో మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు 4 సీసీ టీవీ కెమెరాలను కూడా అమర్చారు. వీటిలోనెల రోజుల పాటు బ్యాకప్ ఉండేవిధంగా డీవీఆర్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సులకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్సో కెమెరా కూడా అమర్చడంతో రివర్స్ గేర్ లో వెల్లేప్పుడు డ్రైవర్ కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా బస్సు ఆగనున్న బస్ స్టేషన్ల వివరాలను అందులో ప్రయాణిస్తున్న వారికి ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఎల్ఈడీ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం (SDSS) కూడా ఉంటుంది. దీంతో అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి ప్రమాదం తీవ్ర రూపం దాల్చకముందే నియంత్రించే అవకాశం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం, పానిక్‌ బటన్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

2400 బస్సుల కొనుగోలు…

హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహితమైన వాతావరణం ఏర్పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్ చార్జింగ్ బస్సులనే నడపాలని సంకల్పించినట్టుగా వెల్లడించారు. త్వరలో 2400 ఈ ఛార్జింగ్ బస్సులను అందుబాటులోకి తీసుకరానున్నామని మంత్రి పొన్నం ప్రకటించారు. రానున్న కాలంలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సూర్యపేట, నల్లగొండతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ బస్సులను నడిపించనున్నామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహాలక్ష్మీ పథకం వల్ల ఆర్టీసీ బస్సులకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్స్ ద్వారా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. కొత్త బస్సులకు సరిపడా ఉద్యోగాలను భర్తి చేస్తామని, ఇప్పటికే 3055 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి పొన్నం వెల్లడించారు. 2013 బాండ్లకు సంబంధించిన డబ్బును కండక్టర్లు, డ్రైవర్లకు సంస్థ చెల్లించిందని, మిగతా బకాయిలను దసరా లోపు చెల్లిస్తామన్నారు.

300 రోజుల్లో రూ. 92 కోట్లు…

రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకానికి అత్యంత ఆదరణ లభిస్తోందని TGSRTC ఎండీ విసి సజ్జనార్ తెలిపారు. కేవలం 300 రోజుల్లో 92 కోట్ల జీరో టికెట్లు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల రాష్ట్రంలోని మహిళలు 3,123 కోట్లు ఆదా చేసుకున్నట్టయిందన్నారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో 2.55 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని, రూ. 100 కోట్ల మేర ఆదాయం సేవ్ అయిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు నిబద్దత, అంకిత భఆవంతో పని చేస్తుండడం వల్లే మహాలక్ష్మీ పథకం సమర్థవంతంగా అమలు అవుతోందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ అన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు మరో 500 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బస్సులను సంస్థ అందుబాటులోకి తీసుకరానుందని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బస్సులను నడిపించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి్, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ ముని శేఖర్, రీజనల్ మేనేజర్ సుచరిత, జేబీఎం ప్రతినిధి చందన్ మిశ్రాలు పాల్గొన్నారు.

You cannot copy content of this page