ఫ్లెక్సీలపై కండక్టర్ల ఫోటోలు..!

డిపోల వద్ద ప్రదర్శన

దిశ దశ, హైదరాబాద్:

కార్మికుల సంక్షేమం కోసం పాటు పడాల్సిన ఆర్టీసీ వారి పరువు బజారుకీడ్చేపనిలో నిమగ్నం అయిందా..? తమ కుటుంబాలను పోషించాల్సిన బాధ్యత కన్నా ఎక్కువగా సంస్థ ఒత్తిళ్లను తట్టుకుని పనిచేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రగతి రథ చక్రాలకు కేరాఫ్ గా చెప్పుకున్న ఆర్టీసీ రథ చక్రాలపై ఆధారపడి పనిచేస్తున్న కార్మిక లోకం నేడు మానసిక క్షోభలో కొట్టుమిట్టాడాల్సిన ధైన్యానికి చేరుకుంది. స్వరాష్ట్రం సిద్దిస్తే తమ బ్రతుకులు మారుతాయని కలలు కన్న కార్మిక లోకం నేడు నిందల పాలయి కంటి మీద కునుకు లేకుండా కాలం వెల్లదీస్తున్నారు. తాజాగా మేడ్చల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆర్టీసీ కార్మిక వర్గాన్ని కలవరపెడుతోంది.

అసలేం జరిగింది..?

గ్రేటర్ హైదరాబాద్ లో నిత్యం లక్షల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. అయితే లోకల్ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా డైలీ పాస్ లు అమ్మాల్సిన బాధ్యత కండక్టర్లపై ఉంచారు. గతంలో ఆర్టీసీ బస్ స్టేషన్లు, ప్రధాన సెంటర్ల వద్ద మాత్రమే విక్రయించే విధానం ఉండాది. ఆ తరువాత కండక్టర్ల చేతికి డైలీ పాసులు అమ్మే బాధ్యతలు అప్పగించింది ఆర్టీసీ. ట్రావెల్ యూజ్ యూ లైక్ డే పాస్ (టీఏవైఎల్) పాసులు కండక్టర్లు లోకల్ బస్సు ప్రయాణీకులకు విక్రయించాల్సి ఉంటుంది. వీరు సాధారణ ప్రయాణీకులకు టికెట్లు విక్రయిస్తూ, నెలవారి పాసులు ఉన్న వారి పాసుల వివరాలను చెక్ చేస్తూ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి డైలీ పాసులు అమ్మాల్సి ఉంటుంది. ఎక్కువగా అమ్మాల్సిన బాధ్యత కండక్టర్ల భుజాలపై ఉంచడంతో డ్యూటీలో ఉన్న కండక్టర్లు బహుముఖ ప్రజ్ఞ పాఠవాలను ప్రదర్శించాల్సిందే. కిక్కిరిసిపోయే బస్సుల్లో ముందు వెనక్కి తిరుగుతూ ప్యాసింజర్లకు టికెట్ల విక్రయించే విషయంలో సర్కస్ ఫిట్లు చేసే కండక్టర్లు హమ్మయ్య అనుకునే సరికి మరో స్టేజీ రానే వస్తుంది. డ్యూటీలో ఉన్నప్పుడు సిటీ బస్ కండక్టరు రిలాక్స్ అయి తన సీట్లో కూర్చునే సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో వీరికి డైలీ బస్సులు అమ్మాలన్న టార్గెట్ కూడా ఆర్టీసీ నిర్దేశించింది. అధికారులు ఇచ్చిన టార్గెట్ రీచ్ కానీ కండక్టర్లపై అంతర్గతంగా చేసే ఒత్తిళ్లు అంతా ఇంతా కాదనే చెప్పాలి. కానీ మేడ్చల్ డిపో అధికారులు మరో అడుగు ముందుకేసి ఈ ఏడాది మే నెలలో తక్కువ పాసులు అమ్మిన వారంటూ వారి ఫోటోలను ఫ్లెక్సీల్లో అచ్చు వేయించి మరీ ప్రదర్శనకు పెట్టారు. దీంతో కండక్టర్లు మరింత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

అన్ని వేళల్లో సాధ్యామా..?

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా తిరిగే సమయం ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. మిగతా సమయాల్లో అంతగా జనం ఉండే అవకాశాలు తక్కువే. వేసవి కాలం, భారీ వర్షాలు పడినప్పుడు సిటీ బస్సులపై ఆధారపడే వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సాధారణ టికెట్లు విక్రయించే పరిస్థితే ఉండదు కానీ డైలీ పాసులు అమ్మడం సాధ్యం కాదన్నది నిజం. వేకువ జామున సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు ఎక్కువగా చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు ఉంటుంటారు. వీరు డ్యూటీ దిగే వరకు బస్సులతో పని ఉండదు కాబట్టి పాసులు తీసుకునే అవకాశం ఉండదు. వీటిపై ఆధారపడేది మాత్రం నాన్ లోకల్ ప్రయాణీకులే ఎక్కువ. అంతేకాకుండా ఇటీవల కాలంలో మహానగరానికి వచ్చే వారికి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యం చేరే అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మెట్రో కావచ్చు, క్యాబ్ లు కావచ్చు, డ్రాపింగ్ చేసేందుకు ర్యాపిడో వంటి సంస్థలు బైక్ లను కూడా అద్దెకు ఇస్తున్నాయి. దీంతో చాలా మంది కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం కంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆధారపడుతున్నారన్నది కూడా నిజం. ట్రాఫిక్ పద్మవ్యూహంతో సిటీ బస్సులను ఆశ్రయించి గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకునేందుకు చాలా మంది సాహసించడం లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా సిటీ బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య కూడా పెరిగినప్పటికీ టీఏవైఎల్ పాసులు తీసుకునేందుకు ముందుకు రాని వారికి బలవంతంగా అంటగట్టే పరిస్థితి ఉండదు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్యాలను చేరలేకపోతున్నారని ఫ్లెక్సీలు వేసి మరీ రచ్చ చేయడం సరికాదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

కొత్త పల్లవి..

మేడ్చల్ డిపోలో టార్గెట్ రీచ్ కాని కండక్టర్ల ఫ్లెక్సీ ఏర్పాటు అంశం హాట్ టాపిక్ కావడంతో గురువారం నుండి సరికొత్త పల్లవి అందుకున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రతిభ చూపిన వారి ఫోటోలు వేసి ఫ్లెక్సీ ఏర్పాటు చేయమంటే టార్గెట్ చేరుకోని వారి ఫోటోలతో ఏర్పాటు చేశారన్న ప్రచారం మొదలు పెట్టారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల నిర్ణయం ఇదే అయితే తాము చెప్పిన ఆదేశాలను పాటించలేదని బాధ్యుల్ని చేసి శాఖా పరంగా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. ఫ్లెక్సీ ఏర్పాటు చేసే ముందు కూడా సంబంధిత అధికారులు క్రాస్ చెక్ చేసుకోకుండానే ప్రదర్శనకు అనుమతించారా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఫ్లెక్సీలపై ముద్రించిన మ్యాటర్ ఫోటోల విషయంలో అధికారులు పర్మిషన్ లేకుండానే అచ్చువేయించే సాహసం ఎలా చేస్తారన్నది మిస్టరీగా మారింది. మీడియా, సోషల్ మీడియా వేదికల్లో అధికారులపై విమర్శల ఝడివాన కురవడం ఆరంభం కాగానే కొత్త పల్లవి అందుకున్నారని ఆర్టీసీ కార్మిక వర్గం చర్చించుకుంటోంది. ఏది ఏమైనా పనితీరును మెరుగు పర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుని కార్మికుల్లో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తే సత్ఫలితాలు రాబట్టవచ్చు కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇతర కార్మికులు కూడా డిఫెన్స్ లో పడిపోయే ప్రమాదం ఉంటుందన్న విషయం ఆర్టీసీ అధికారులు గమనించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page