ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ…

దిశ దశ, హైదరాబాద్:

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితి నెలకొంది అన్న విషయాలపై ఆరా తీసేందుకు టీఎస్ ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. సోమవారం మద్యాహ్నం జూబ్లి బస్ స్టేషన్ కు వెల్లిన సజ్జనార్ మహిళా ప్రయాణీకులను ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి జేబీఎస్ నుండి ప్రజ్ఞాపూర్, జనగామలకు వెల్తున్న పల్లె వెలుగు, బాన్సువాడకు వెల్తున్న ఎక్స్ ప్రెస్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత రూట్ నంబర్ 18లో సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు సజ్జనార్ ప్రయాణిస్తూ మహిళా ప్రయాణీకులకు జీరో టికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుండి విశేష స్పందన వస్తోందని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్ జెండర్లు, బాలికలు ఈ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. మహిళా ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను చేసిందని, ఉచిత బస్సు సౌకర్యం గురించి సంస్థలో 40వేల మంది ఆర్టీసీ సిబ్బందికి అవగాహనా కల్పించామన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆధార్ కార్డు సిబ్బందికి చూపించాలన్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలు చేయగానే ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని అందుకు తగ్గట్టుగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. రద్దీ వేళల్లో ప్రయాణీకులు సంయమనం పాటించి ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. పొరపాట్లు  జరిగినట్టయితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకరావాలని కోరారు. అలాగే 040 69440000, 040 23450033 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని, ఈ రెెండు ఫోన్లు కూడా 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఆర్ఎంలు శ్రీధర్, ఖుష్రోషా ఖాన్ లు కూడా పాల్గొన్నారు.

You cannot copy content of this page