ఆర్టీసీ విలీనం అంశం…
దిశ దశ, హైదరాబాద్:
ట్విస్టులు మధ్య మరో ట్విస్టు చోటు చేసుకోవడం అంటే ఇదేనేమో. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. సంస్థ ఆస్థులతో పాటు ఇతరాత్ర అంశాలపై క్లారిటీ లేనందున లోతుగా అధ్యయనం చేసిన తరువాతే చెప్తామని రాజ్ భవన్ వర్గాలు చెప్పాయి. ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ఆమోద ముద్ర ఖచ్చితంగా కావల్సిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ విలీన బిల్లును రాజ్ భవన్ కు పంపించినప్పటికీ రాజ్ భవన్ వర్గాల నుండి మాత్రం స్పందన రావడం లేదు. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడే బిల్లుకు గవర్నర్ ఓకె చెప్తారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. రాజ్ భవన్ నుండి సానుకూలత రాకపోవడంతో అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా రోడ్లపైకి వచ్చి గవర్నర్ కు వ్యతిరేకంగా నిరసన కూడా తెలిపారు. అయినప్పటికీ రాజ్ భవన్ నుండి మాత్రం సానుకూల సంకేతాలు మాత్రం అందలేదు. తాజాగా ఈ బిల్లును ఆమోదించాలా వద్దా అన్న అంశంపై రాష్ట్ర గవర్నర్ లీగల్ ఒపినియన్ తీసుకోవాలని భావించారు. ఈ మేరకు బిల్లును న్యాయ నిపుణులకు రాజ్ భవన్ వర్గాలు పంపించినట్టుగా తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు బిల్లులో మార్పులు చేర్పులు కోరే అవకాశం ఉంటుంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post