దిశ దశ, కరీంనగర్:
ఎవరు కొన్నారో..? ఎవరి చేతుల్లో పెరిగి పెద్దదైందో..? ఎక్కడ బస్సు ఎక్కిందో కానీ ఆ కోడి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. ఆర్టీసీ అధికారుల చేతికి చిక్కిన ఈ కోడి తిరిగి ఎవరి వద్దకు చేరుతుందో అన్నది కూడా సస్పెన్స్ గానే మిగిలింది. దానిని చేజిక్కించుకున్న వారు పందెం కోడిగా బరి గీసి కొట్లాడేంందుకు తలకు కత్తి కడతారా లేక మెడపై వేటు వేస్తారా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
ఆర్టీసీ అధికారులకు చిక్కిన పందెం కోడిని వేలం వేసేందుకు నిర్ణయించారు. రెండు రోజుల క్రితం వరంగల్ నుండి వేములవాడ వెల్తున్న బస్సులో ఓ ప్రయాణీకుడు కోడిని ఉంచిన బ్యాగును వదిలేసి పోయాడు. కోడి ఉన్న బ్యాగును గమనించిన కండక్టర్ కరీంనగర్ ఆర్టీసీ కంట్రోలర్ కు అప్పగించారు. అయితే కోడిని కరీంనగర్ 2వ డిపోలో ఉంచారు. ఆ కోడి తనదేనంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలం వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కరీంనగర్ 2వ డిపో మేనేజర్ మల్లయ్య ఈ పందెం కోడి వేలం వేస్తున్నామంటూ నోటీసు కూడా ఇచ్చారు. శుక్రవారం మద్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిర్వహించే వేలంలో పాల్గొని కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు.