దిశ దశ, కరీంనగర్:
ఈ రోజు మద్యాహ్నం వేలం వేయాల్సిన కోడి విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాలుగు రోజులుగా ఆర్టీసీ 2వ డిపోలో ఉంటున్న కోడిని వేలం వేస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కోడి తనదేనంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్థిరపడ్డ నెల్లూరు జిల్లా వాసి మహేష్ శుక్రవారం ఉదయం ఆ కోడి తనదేనంటూ మీడియాకు వెల్లడించారు. దీంతో అతని అభ్యర్థన మేరకు ఆర్టీసీ అధికారులు వేలం వేస్తారా నిలిపివేస్తారా అన్న విషయంపై తర్జనభర్జన సాగింది. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు తీసుకున్న తాజా నిర్ణయం సంచలనంగా మారింది. తమ ఆధీనంలో ఉన్న కోడిని అమ్మేందుకు నిర్వహించాలనుకున్న వేలం పాటను రద్దు చేశారు. ఈ రోజు 3 గంటల ప్రాంతంలో ప్రారంభించాల్సిన వేలం పాటను నిలిపివేస్తున్నామని కరీంనగర్ 2వ డిపో మేనేజర్ మల్లయ్య తెలిపారు. నిభందనల ప్రకారం ఈ కోడిని జంతు సంరక్షణ శాలకు అప్పగిస్తున్నామని వివరించారు.
యజమానికి చేరుతుందా..?
తాజాగా ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ కోడి తిరిగి తన యజమాని మహేష్ వద్దకు చేరుతుందా లేక జంతు సంరక్షణ శాలలోనే ఉంచుతారా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. ఆ కోడి తనదేనంటూ మహేష్ దానికి సంబంధించిన వీడియోలు, ఫోటలతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన టికెట్ కూడా షేర్ చేశారు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం దానిని జంతు సంరక్షణ శాలకు అప్పగించడంతో కొత్తమలుపు తిరిగినట్టయింది. ఈ కోడిని తిరిగి అతనికి అప్పగించేందుకు జంతు సంరక్షణ శాల యంత్రాంగం యజమాని వస్తే ఇస్తారా లేదా అన్నదే పజిల్ గా మారింది.