నార్త్ వైపునకు సీఎం… సౌత్ వైపునకు మాజీ సీఎం

దిశ దశ, హైదరాబాద్:

రాజకీయాల్లో ఒకరు ఎడ్డెం అంటే మరోకరు తెడ్డెం అనడం సహజంగా వినిపిస్తుంటుంది. అధికార పక్షంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం, ప్రతిపక్షంపై అదికార పక్షం విరుచకపడడం చూస్తుంటాం. వివిధ వేదికల్లో రెండు పక్షాల నాయకులు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం సహజంగా చూస్తుంటాం. ఎడమొఖం పెడ మొఖంగా వ్యవహరించే ఇరు పక్షాల నాయకులు రాష్ట్రంలోని నీటి పంచాయితీ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం ఈ విమర్శలకు వేదికలుగా ఎంచుకున్న తీరు కూడా వ్యతిరేక దిశలోనే ఉండడం గమనార్హం. దక్షిణ తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్న కృష్ణ నదిపై ఉన్న ఉమ్మడి రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులను కెఆర్ఎంబీకి అప్పగించారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ‘‘ఛలో నల్గొండ’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మంగళవారం జరగనున్న ఈ సభ్యకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నారు. కృష్ణ నదిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీరును ఎండగట్టడంతో పాటు ఈ నిర్ణయం వల్ల కలిగే నష్టాలను కూడా ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిలు ముగిసిన తరువాత తొలిసారి భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా కేంద్రాన్ని ఎంచుకుంది. మరో వైపున కాళేశ్వరం వైఫల్యాలను ఎత్తి చూపేందుకు అధికార పక్షం కూడా సమాయత్తం అయింది. రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వారిని ఆహ్వానించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్మించిన మేడిగడ్డ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ సహచరులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు హాజరవుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన పిల్లర్లను పరిశీలించడంతో పాటు అక్కడి నుండే అప్పటి ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్దే ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కాళేశ్వరం వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ఉత్తర తెలంగాణ మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరుపై బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది.

ఒకే రోజున…

అయితే ఒకే రోజుల ఉత్తరాన అధికార పక్షం గత ప్రభుత్వం గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ప్రయత్నిస్తుండగా, దక్షిణాదిన విపక్షం కృష్ణ నదిపై ప్రాజెక్టులను కెఆర్ఎంబీకి అప్పగించిన విషయంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బహిరంగ సభ ఏర్పాటు చేసింది. సాధారణంగా అధికార విపక్షలు ఉత్తర ధక్షిణ ధృవాలుగా వ్యవహరిస్తున్నాయన్న చర్చలు జరగడం గమనించి ఉంటాం. కానీ తెలంగాణాలో మాత్రం ఉత్తరం వైపు ఓ పక్షం, దక్షిణాది ప్రాంతానికి మరో పక్షం వెల్లి విమర్శలకు పదును పెడుతోంది.

You cannot copy content of this page