19,20,21 పిల్లర్ల వద్ద ఏర్పడ్డ సమస్య
దిశ దశ, భూపాలపల్లి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అపశృతి చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో సమీప గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. బ్యారేజ్ లోని 6వ బ్లాక్ లోని 15వ పిల్లర్ నుండి 21 పిల్లర్ల వద్ద బ్యారేజ్ కుంగిపోవడంతో ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ బ్యారేజ్ కుంగిపోవడం సంచలనంగా మారింది.
మోహరించిన బలగాలు…
శనివారం రాత్రి బ్యారేజ్ కుంగిపోయిన విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన పోలీసుల బలగాలను మోహరింపజేశారు. మహారాష్ట్ర, తెలంగాణల మీదుగా వాహనాల రాకపోకలను కూడా నిలిపివేసి ఇతర రహదారుల వైపు మళ్లించారు. దీంతో బ్యారేజ్ ఎంతటి ప్రమాద స్థాయికి చేరుకుందోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం సాయంత్రం వరకూ వాహనాల రాకపోకలను అనుమతించిన ఇరిగేషన్ అధికారులు రాత్రి అయ్యే సరికి బ్యారేజ్ కి ఇరువైపులా రోడ్ స్టాపర్లను ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే లిమిటెడ్ గా అనుమతి ఇస్తున్న పోలీసులు కార్లతో పాటు ఇతర వాహనాలను కాళేశ్వరం, సిరొంచ మీదుగా మళ్లిస్తున్నారు. అయితే మొదట ఇక్కడ పోలీసుల బలగాలు మోహరించగానే పొరుగునే ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఉండడంతో నక్సల్స్ కట్టడి చర్యలు తీసుకుంటున్నారని భావించారంతా. అలాగే తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద అలజడి చెలరేగి ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Disha Dasha
1884 posts
Prev Post