ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు ఒప్పుకున్న సైఫ్

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు, దాని వెనక ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తాను ప్రీతిని వేధించలేదని చెబుతూ వస్తోన్న సైఫ్.. తాజాగా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

ప్రీతి ఆత్మహత్యకు సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు చెప్పినా.. సైఫ్ మాత్రం అలాంటిదేం లేదని చెప్పాడు. తను సీనియర్ కనుక ప్రీతి వృత్తిరీత్యా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పానే కానీ.. ర్యాగింగ్ చేయలేదని వాదిస్తూ వచ్చాడు. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి వాట్సాప్ చాట్స్ బయటపెట్టారు. ఆధారాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉండటంతో.. తాను ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు సైఫ్ ఒప్పుకున్నట్లు సమాచారం.

సైఫ్ తన తప్పును ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. దాదాపు నాలుగు రోజుల పాటు విచారణ జరిపి.. పక్కా ఆధారాలతో సైఫ్‌ను సెంటర్ చేశారు. పోలీసులు చూపిన ఆధారాలతో ఇక సైఫ్ తాను తప్పించుకోలేనని అర్థం చేసుకుని నిజం అంగీకరించినట్లు సమాచారం. సైఫ్ కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో అతడిని ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలోనే పోలీసులు కోర్టుకు సమర్పించాల్సిన కన్ఫెషన్ నివేదికలో ఈ విషయాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం, ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 26న మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొదట నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రీతి మరణంపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రీతిని సైఫ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె తండ్రి నరేంద్ర ఆరోపించారు. ప్రీతి ఆత్మహత్య ఘటనలో ఎవరి ప్రమేయంలో ఉందో పోలీసులు తమకు చెప్పాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page