నాలుగు నెలల క్రితం శపథం

అరుణ్ హత్యకు అప్పుడే స్కెచ్..?

దిశ దశ, మానకొండూరు:

కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఫైరింగ్ కలకలం ఘటనపై తవ్వినాకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం అర్థరాత్రి సమయంలో మానకొండూరుకు చెందిన రౌడీ షీటర్ అరుణ్ పై కాల్పులు జరిపి దాడులకు పాల్పడిన ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. తన చెల్లెలి మరణానికి కారణమైన అరుణ్ ను చంపితీరుతానని నిందితుల్లో ఒకరైన సాయితేజ నాలుగు నెలల క్రితమే శపథం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం కాలనీ హనుమాన్ మందిర్ లో మానకొండూర్ అరుణ్ ని చంపుతానన్న సాయి తేజ ప్రమాణం చేసినట్టుగా రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు పోలీసులకు కీలక ఆధారంగా మారింది. మద్యం మత్తులో సాయి తేజ ఛాలెంజ్ చేసినట్టుగా అర్థమవుతున్న ఈ వీడియోలో చెప్పినట్టుగానే బుధవారం రాత్రి పథకం ప్రకారం అరుణ్ పై దాడి చేసి కాల్పులు జరిపేందుకు మానకొండూరు చేరుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. అరుణ్ కు, సాయి తేజ కు మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలే హత్యాయత్నానికి కారణమై ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం వాస్తవాలు వెలికి తీసే పనిలో పడ్డారు. అయితే బుధవారం రాత్రి రౌడీషీటర్స్ గ్యాంగ్ హత్యాయత్నం చేసిన తరువాత అరుణ్ తనకు ప్రాణ భయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కారణాలేంటో..?

వివాదాలతోనే సహజీవనం చేస్తున్న రౌడీ షీట్స్ గ్యాంగ్స్ ఎందుకు తలపడ్డాయి..? అసలు అరుణ్ పై ఎందుకు దాడి చేయాలనుకున్నాయి అన్న వివరాలను సేకరించే పనిలో కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కర్ణాకర్ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మానకొండూరు సీఐ రాజ్ కుమార్ తో పాటు ఇతర పోలీసు అధికారులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. నిందితులు అంతా కూడా గోదావరఖనికి చెందిన వారే ఉండడంతో వారి ఆచూకి కోసం సీఐ ప్రత్యేక దృష్టి సారించారు ఇంతకు ముందు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసిన రాజ్ కుమార్ వారిని పట్టుకునేందుకు స్పెషల్ హంటింగ్ చేపట్టినట్టు సమాచారం.

గతంలో స్నేహితులే…

అరుణ్ గ్యాంగ్, ఆయనపై దాడికి పాల్పడిన గ్యాంగ్ గతంలో అంతా కలిసే తిరిగే వారని ప్రచారం జరుగుతోంది. హైదారాబాద్ లో కలిసి మెలిసి తిరిగిన వీరి మధ్య చంపుకునేంత శత్రుత్వం ఎందుకు వచ్చిందోనన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సాయి తేజ చేసిన శపథాన్ని బట్టి అతని కుటుంబానికి అరుణ్ తీరని అన్యాయం చేశాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా గోదావరిఖని గ్యాంగ్ కు స్మగ్లింగ్ కార్యకలాపాలతో కూడా సంబంధాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతున్నందున ఈ విషయంలో ఏమైనా వీరి మధ్య బెడిసికొట్టిందా అన్న అనుమానం కూడా వస్తోంది. రెండు గ్యాంగులు కూడా నేరమయ ప్రపంచంతోనే అనుభందం పెనవేసుకోవడంతో అసలు చంపుకునే వరకు ఎందుకు వచ్చిందోనన్న విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.

You cannot copy content of this page