సర్కారు బడిలో సంస్కరపు అడుగులు…
ఫేర్వెల్ పార్టీకి సరికొత్త నిర్వచనం
దిశ దశ, మానకొండూరు:
తలా కొన్ని డబ్బులు పోగేసుకుని సార్లూ, పిల్లులు కలిసి డీజే సౌండ్స్ పెట్టుకుని డ్యాన్సులు చేయడం, వీడ్కోలు పార్టీ అంటే ఇదేనన్న రీతిలో భ్రమిస్తూ కాల వెల్లదీసే సాంప్రదాయంతో మమేకమైంది నేటి సమాజం. కల్చర్ అంటే ఇదేనన్న గుడ్డి నమ్మకంతో ముందుకు సాగుతున్న తీరుకు వైవిద్యంగా ఆ బడిలో సంస్కారపు అడుగులు పడుతున్నాయి. ఆ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఆధునిక పాటలు వినిపించవు, అలాంటి పోకడలూ ప్రతిబింభించవు. సంస్కృత శ్లోకాలు వినిపిస్తూ మాతృ మూర్తులు రుణం తీర్చుకునే విధంగా వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంస్కరించుకోవడం అంటే ఇదేనని… కడుపున పుట్టిన బిడ్డలచే తల్లులకు పాదాభిషేకం చేయిస్తుంటారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగిస్తున్నారు. అమ్మ అంటే ఆడుకునే బొమ్మ కాదు… నవ మాసాలు కడుపున పెంచి జన్మనిచ్చిన ప్రత్యక్ష్య దైవం అన్న విషయాన్ని విద్యార్థులు తమ మదిలో పదిలంగా దాచుకునే విధంగా మాతృ వందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులంతా కూడా పాఠశాల ఆవరణలో తమ తల్లులకు పాద పూజ చేసి తరించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూప కల్పన చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రంలోని గవర్నమెంట్ హైస్కూల్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అంతా కూడా మాతృత్వపు మమకారం శాశ్వతంగా గుర్తుండే విధంగా నిర్వహిస్తున్నారు. హెడ్ మాస్టర్ కట్టా రవింద్రాచారితో పాటు ఉపాద్యాయ బృందం అంతా కూడా మాతృవందన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఇతర పాఠశాలల్లో అయితే ఫేర్వెల్ సెలబ్రేషన్స్ పేరిట పాశ్యత్య సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వ్యవహరిస్తుంటే గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలలో మాత్రం అమ్మతనంలోని కమ్మదనం గురించి సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. మాతృదేవోభవా అని నోటితో చెప్పడం కాదు, చేతల్లోనూ చూపించినప్పుడు ఆ అమ్మ కడుపున పుట్టిన బిడ్డలకు సార్థకత చేకూరుతుందని అంటున్నారు ప్రధానోపాద్యాయులు కట్టా రవింద్రా చారి. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల పిల్లల్లో మాతృమూర్తులపై మరింత మమకారం పెరుగుతుందని, ప్రత్యక్ష్య దైవాలైన అమ్మలను ఆదరించాల్సిన అవశ్యకత ఎంతో ఉందన్న విషయం వారిలో పది కాలాల పాటు నిలిచిపోవాలన్నదే తమ తాపత్రయమన్నారు. సమాజంలో ఆది గురువు అయిన అమ్మలను అన్ని వేళల్లో పూజించాలన్నదే తమ సంకల్పమని వివరించారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి అత్యంత అరుదైన ఘట్టం నిర్వహిస్తుండడం నిజంగా ఆదర్శప్రాయమనే చెప్పాలి. బడులంటే పుస్తకాల్లోని పాఠాలు చెప్పి చేతులు దులుపుకునే కేంద్రాలు కాదు… విద్యార్థులను అన్నింటా సంస్కారవంతులుగా తీర్చిదిద్దే ప్రధాన వేదికలు అని చేతల్లో చూపిస్తున్నారు గన్నేరువరం హైస్కూల్ మాస్టార్లు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అరుదైన కార్యక్రమానికి వేదికగా మారిన గన్నేరువరం పాఠశాల అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నది మాత్రం నిజం.