తండ్రుల కోసం త‌నయుల తపన …

కరీంన‌గ‌ర్‌లో నేడు విశిష్ట పుర‌స్కారాల ప్ర‌దానం

దిశ దశ, కరీంనగర్:

సాహితీ కసుమాల పుట్టినిల్లు… సాహిత్య చైత‌న్యంతో విరాజిల్లే క‌రీంన‌గ‌ర్ గత వైభవపు ఆనవాళ్లను స్మరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అలనాడు కళా రంగానికి విశిష్ట సేవలు అందించిన దిగ్గజాల స్పూర్తిని నేటి తరానికి అందించేందుకు వారి వారసులు చేస్తున్న ప్రయత్నం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. స‌మైక్య సాహితీ ఆధ్వర్యంలో ఏటా నిర్వ‌హించే విశిష్ట పుర‌స్కార ప్ర‌దానోత్స‌ శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఫిల్మ్ భ‌వ‌న్‌లో జ‌రగనుంది. వివిధ‌ కళారంగాల్లో తమదైన ముద్ర వేసిన త‌మ తండ్రుల పేరిట అయిదుగురు వారసులు వివిధ రంగాల్లో అవిర‌ళ కృషి చేస్తున్న వారికి పుర‌స్కారాలు అందిస్తున్నారు. త‌ల్లి దండ్రుల‌ను, వారి మూలాల‌ను ఎన్న‌టికీ మ‌రువ‌రాద‌నే ఆద‌ర్శాన్ని చాటుతున్న వీరు 2017 నుంచి అందిస్తున్న ఈ పుర‌స్కారాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. పెద్ద‌ప‌ల్లి అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ జి.శ్యాంప్ర‌సాద్ లాల్‌, మాడిశెట్టి గోపాల్‌, కేఎస్ అనంతాచార్య‌, రావికంటి శ్రీ‌నివాస్, డాక్ట‌ర్ ర‌ఘురామ‌న్‌లు వీటిని ప్ర‌దానం చేస్తున్నారు. పురస్కార గ్రహీతలకు శాలువా, మెమెంటోల‌తో స‌త్క‌రించ‌డ‌మే కాకుండా క్యాష్ అవార్డును కూడా ఇస్తున్నారు.

పుర‌స్కార గ్రహీతలు వీరే…

కరీంనగర్‌కు చెందిన ప్ర‌ముఖ‌ సంగీత విద్వాంసులు కలకుంట్ల సంపత్ కుమారాచార్యులు: ఆయన స్వరపరిచిన రాగాలు సంగీత ప్రియుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. తను అడుగుపెట్టిన ప్రతి పాఠశాలలో పిల్లలు రాగాలు తీస్తుంటే విద్యాధికారులు ఆశ్చర్యపోయిన సందర్భాలెన్నో. హార్మోనియంలో ఉన్న ప్రతిభతో పాఠశాలల్లో పిల్లలతో ఎన్నో నాటకాలు ప్రదర్శింపజేశారు. ఆయ‌న పేరిట సంగీత పుర‌స్కారాన్ని త‌న‌యుడు కేఎస్ అనంతాచార్య అందిస్తున్నారు. ఈ సంవ‌త్స‌రం సంగీత విద్వాంసుడు, తెలుగు రాష్ట్రాలలో వేలాది మందిని గాయకులుగా తీర్చి దిద్దుతున్న సంగీత గురువు రామాచారికి ప్ర‌దానం చేయ‌నున్నారు.

హుస్నాబాద్‌కు చెందిన ఆచార్య రజనీశ్రీ కళా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. నాట్యాచార్యులుగానే కాకుండా నటునిగా, దర్శకునిగా,కవిగా, రచయితగా, ఉపాధ్యాయుడిగా గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. జానపద నృత్యాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న రంగాలలో కృషిచేసిన రజనీశ్రీ స్ఫూర్తి కొనసాగాలని ఆయన తనయుడు, పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ పేరిణి నృత్య కళాకారుడు ప్రకాశ్‌కు ఈ పురస్కారం ప్రకటించారు.

ఆద‌ర్శ‌ ఉపాధ్యాయుడు మాడిశెట్టి మల్లయ్య. ఆట, పాట, మాటలన్నింటినీ సమన్వయం చేసుకొని విద్యార్థులకు బోధించిన అక్షర సూర్యుడు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన తనయుడు మాడిశెట్టి గోపాల్ తండ్రి పేరిట ఏటా ఒక ఉపాధ్యాయునికి పురస్కారం అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ పాఠ్యపుస్తక రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు, జాతీయవాది గాజుల రవీందర్‌కు ప్ర‌దానం చేయ‌నున్నారు.

తెలంగాణ సాహితీ చరిత్రలో చెప్పుకోద‌గిన కవుల్లో ఒకరైన రావికంటి రామయ్య గుప్త‌. మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందిన ఆయేన సహజ కవిగా, ప్రజాకవిగా సాహితీ లోకంలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర విద్య‌, పరిశోధన సంస్థ రూపొందించిన పాఠ్య‌పుస్తకాల్లో వీరి పద్యానికి చోటు లభించింది.వారి వారసుడు సీనియర్ జర్నలిస్ట్ రావికంటి శ్రీనివాస్ తండ్రి పేరున ఏటా సాహిత్య పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రముఖ ప‌ద్య‌కవి, అవధాని ముద్దు రాజయ్యకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

డాక్టర్ నాగభూషణం కరీంనగర్‌లో పేరెన్నికగ‌న్న వైద్యులు. చారిత్రక అంశాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తితో తపాలా బిళ్ల‌లు, నాణేలు ఇతర రకాల వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశారు. వారి సామాజిక సేవలు గుర్తించి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వయో శ్రేష్ఠ సన్మాన్‌ అవార్డు ప్రకటించింది. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జీవన సాఫల్య పురస్కారాన్ని పొందారు. ప్రవృత్తి రీత్యా పురావస్తు సేకరణలో అగ్రగణ్యుడిగాపేరు పొందారు. వారి స్మారకార్థం ఆయన తనయుడు డాక్టర్ రఘురామన్ పరిశోధన పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ నవ చరిత్ర పరిశోధకులు ద్యావ‌న‌ప‌ల్లి సత్యనారాయణకు ఈ అవార్డు ప్రకటించారు.

You cannot copy content of this page