రూ. 571 కోట్లు కెటాయించిన ప్రభుత్వం
దిశ దశ, మహదేవపూర్:
గోదావరి నది పరివాహక ప్రాంతమే అయినా… నీటి వనరులు అందుబాటులో ఉన్నా సాగు నీటి కటకట మాత్రం అక్కడ వెక్కిరిస్తోంది. మంథని నియోజకవర్గంలోని మానేరు ఎగువ ప్రాంతానికి శ్రీరామ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందుతున్నప్పటికీ దిగువన ఉన్న మహదేవపూర్ పాత తాలుకా పరిధిలోని వ్యవసాయ భూములకు నీటి లభ్యత లేకుండా పోయింది. దీంతో 2007లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడగా బీరసాగర్ వద్ద పంప్ హౌజ్ నిర్మాణం జరడంతో పాటు పైప్ లైన్ల నిర్మాణం కూడా కొంత మేర జరిపారు. ఇందుకు సంబంధించిన భూ సేకరణ కూడా జరిపినప్పటికీ స్వ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమ ప్రభావంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ప్రభుత్వం కాళేశ్వరం వద్ద భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేయడంతో 2007లో శ్రీకారం చుట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మరుగున పడిపోయింది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని అప్పటి మంత్రి హరీష్ రావు కూడా ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అన్న అనుమనాలు రేకెత్తాయి. తాజాగా శనివారం అసంపూర్తిగా మిగిలిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ. 571 కోట్లు కెటాయించాలని నీటి పారుదల విభాగం సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఇరిగేషన్ అధికారులతో జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం కల్గించినట్టయింది. 17 ఏళ్లుగా కొనసాగుతున్న చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు మంత్రులు తీసుకున్న నిర్ణయంతో రైతులకు వరంగా మారనుంది. 63 గ్రామాల్లోని 45 వేల ఎకరాల భూమికి సాగు నీరందించడంతో పాటు, తాగు నీటి అవసరాలు కూడా ఈ ప్రాజెక్టు తీర్చనుంది. అయితే కొత్తగా కెటాయించిన ఈ నిధులతో పాటు అప్పటి డిజైన్ లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చఏశారు. కన్నెపల్లి ఒకటో పంప్ హౌజ్ కు గోదావరి నది అప్రోచ్ కెనాల్ ద్వారా 4.2 టీఎంసీల నీటిని దిగువన ఉన్న రెండో పంప్ హౌజ్ కు తరలించనునర్నారు. మొదటి పంప్ హౌజ్ 600 క్యూబిక్ ఫీట్ల మేర నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉండడం కూడా లాభిస్తుందని ఇక్కడి నుండి మహదేవపూర్ లోని ఎర్ర, మందరం చెరువులకు నీటిని తరలించాలని అధికారులు అంచనా వేస్తున్నారు. కాటారంలో ఏర్పాటు చేసిన రెండో పంప్ హౌజ్ నుండి గారెపల్లి, పోలారం తాండ్ర, ఎల్లాపూర్, కొత్తపల్లి, రుద్రారం, ధన్వాడ, ఆదివారంపేట, గుమ్మళ్లపల్లి, వీరాపూర్, గూడూరు గ్రామాల్లోని చెరువులకు నీటిని సరపరా చేయనున్నారు.ఇందులో భాగంగా మహదేవపూర్ లోని ఎర్రచెరువు సామర్థ్యాన్ని పెంచడం, గండి పడిన రుద్రారం చెరువును బాగు చేయించడం వంటి పనులు కూడా చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎస్సారెస్పీ కెనాల్స్…
మరో వైపున ఎగువ ప్రాంతానికి శ్రీరామ సాగర్ ప్రాజెక్టు కెనాల్స్ ను కూడా బాగు చేయించాలని నిర్ణయించారు. 28 వేల 800 ఎకరాలకు ఆయాకట్టుకు ఎస్సారెస్పీ నీరందించాల్సి ఉన్నప్పటికి డీ 83 కెనాల్ ద్వారా గుండారం రిజర్వాయర్ వరకు గోదావరి జలాలు చేరుకుంటున్నాయి. కానీ మైనర్లలో పూడిక చేరడంతో పాటు ఇతరాత్ర కారణాల వల్ల లక్ష్యానికి తగ్గట్టుగా ఆయాకట్టుకు నీరందడం లేదు. గుండారం రిజర్వాయర్ నుండి నీటిని తరలించాల్సిన మైనర్లను బాగు చేయడంతో పాటు నీటి సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు.