ఒకే పేరు… ఒకే వృత్తి…

జగిత్యాలలో ఇద్దరూ డాక్టర్లే…

దిశ దశ, జగిత్యాల:

ఆ జిల్లాలో అధికార పార్టీ వైవిద్యంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ఒకే పేరుతో ఒకే వృత్తిలో కొనసాగతున్న ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం చర్చకు దారి తీస్తోంది. డాక్టర్ అని ఇప్పటి వరకు ఒక్కరినే సంబోధించాల్సి రాగా ఆ జిల్లా బీఆరెఎస్ శ్రేణులు ఇక నుండి వివరంగా పేర్లు ఉచ్ఛరించాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో జగిత్యాల జిల్లా ప్రత్యేకతను సంతరించుకుంది.

ఆర్థో… ఐ స్పెషలిస్టులు…

జగిత్యాల జిల్లా కేంద్రం నుండి రెండో సారి బరిలో నిలుస్తున్న డాక్టర్ సంజయ్ నేత్ర వైద్య నిపుణులు కాగా… కోరుట్ల నుండి తొలిసారి పోటీ చేయబోతున్న డాక్టర్ సంజయ్ కుమార్ ఆర్థోపెడిక్ డాక్టర్ కావడం విశేషం. ఇద్దరి పేర్లు కూడా సంజయ్ కావడం… ఇద్దరి ప్రొఫెషన్ కూడా వైద్య వృత్తి కావడం గమనార్హం. ఇక జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు అభ్యర్థుల పేర్లు చెప్పగానే తికమకపడాల్సి రాక తప్పదు. దీంతో ఇక జగిత్యాల సంజయ్… కోరుట్ల సంజయ్ అని పిలవాల్సి వస్తుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

ఆ రికార్డు కూడా…

మరో వైపున భారత రాష్ట్ర సమితిలో జగిత్యాల మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న విద్యాసాగర్ రావు తనకు టికెట్ వద్దని తన తనయుడికే అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన అధిష్టానం ముందు ఉంచడంతో ఈ రికార్డు అందుకుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా… సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేత ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉండడం కొత్త సాంప్రాదాయానికి తెరలేపినట్టయింది. అనారోగ్యం కారణంగా తనకు టికెట్ వద్దని చెప్పడం వల్లే విద్యాసాగర్ రావుకు కాకుండా ఆయన కొడుక్కి టికెట్ ఇచ్చినప్పటికీ కీలకమైన బాధ్యతల్లో ఉన్న నాయకుడు టికెట్ వద్దని చెప్పి ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంటానని ప్రకటించడం విశేషం.

You cannot copy content of this page