తీరు మారలేదా? రోగులను పట్టించుకోరా?

దిశ దశ, జగిత్యాల:

నేను రాను తల్లో సర్కారు దవాఖానకు… వద్దు వద్దు తల్లో యముడల్లె దవాఖానకు అన్న పాటకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో. 24 గంటలు రోగుల సేవలో తరించాల్సిన సిబ్బంది పట్టించుకోవడం లేదు. పేషేంట్లు తలడిల్లి పోతున్నా… కాపాడాలంటూ అరిచినా డోన్ట్ కేర్ అంటున్నారు. దీంతో గంపెడు ఆశలతో పెద్ద దవాఖానకు వచ్చిన పేషంట్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతోంది. ఆదివారం అర్థరాత్రి భూమయ్య అనే పేషెంట్ బెడ్ పై నుంచి కింద పడిపోయాడు. చచ్చిపోతున్నానని అరిచినా డ్యూటీలో ఉన్నవారు పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేసింది. ఈ విషయాన్ని గమనించిన ఇతర పేషేంట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో మీడియా జగిత్యాల జిల్లా ఆసుపత్రికి చేరుకోగానే అప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్న వారిలో చలనం వచ్చింది.

ఇటివలే…

గొల్లపల్లి మండలానికి చెందిన వృద్ధ దంపతుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న భార్యభర్తలు ఆసుపత్రికి వచ్చారు. తన భర్తకు చికిత్స చేస్తున్న క్రమంలో వృద్దురాలు భర్త బెడ్ పై పడిపోయారు. దీంతో అటెండెంట్ గా ఉన్న ఆమెను ఆసుపత్రి బయటకు తీసుకొచ్చి రోడ్డు పక్కన దింపి వెళ్లిపోయారు హాస్పిటల్ సిబ్బంది. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్త కూడా భార్య కోసం వెతుక్కుంటూ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు. ఇలా తరచూ ఏదో సంఘటనలతో జగిత్యాల జిల్లా హస్పిటల్ యంత్రాంగం పనితీరు బయటపడుతూనే ఉంది. అయినా ఇక్కడ పని చేస్తున్న వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

You cannot copy content of this page