మానేరు తీరంలో ఇసుక మేటలు…
దిశ దశ, కరీంనగర్:
పచ్చదనంతో ఫరిడవిల్లాల్సిన మానేరు తీరంలోని పంట భూముల్లో ఇసుక మేటలు వేయడానికి కారణం ఏంటీ..? గతంలో ఏనాడూ లేని విధంగా పెద్ద ఎత్తున భూములు నాశనం కావడానికి కారణాలేంటీ..? నిర్లక్ష్యం ఎవరిది… ఫలితం అనుభవవిస్తున్నదెవరూ..? మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా వరదలతో వేసిన పంటలు నాశనం కాగా… అందులోనే ఇసుక మేటలు వేయడంతో ఈ ఏడాది సాగు చేయడం కూడా కష్టతరంగా మారింది పరివాహక ప్రాంత రైతాంగానికి.
మానేరు తీర జిల్లాల్లో…
మానేరు పరివాహక ప్రాంత జిల్లాల్లో ఇసుక రీచులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి తయారైందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మానేరు నుండి ఇసుకను తరలించి స్టాక్ యార్డులను ఏర్పాటు చేశారు. ఈ యార్డుల్లో వర్షాకాలం వస్తుందని ముందు జాగ్రత్తగా ఇసుకను తరలించి పెద్ద ఎత్తున స్టాక్ చేసి పెట్టారు. వర్షాకాలంలో నదుల నుండి ఇసుక తీయడం కష్టమని భావించి ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే ఊహించని విధంగా భారీ వర్షాలు రావడం… ఎగువ ప్రాంతాల నుండి వరద ఉధృతి పెరిగిపోవడంతో మానేరు నది పరివాహక ప్రాంతాల్లోని పంట భూములన్ని కూడా జలమయం అయ్యాయి. దీంతో స్టాకు యార్డుల్లోని ఇసుక కూడా కొట్టుకపోయి సమీపంలోని పొలాల్లో మేటలు వేసింది. వరద తగ్గుముఖం పట్టిన తరువాత రైతులు తమ భూముల పరిస్థితిని చూసి అల్లాడిపోతున్నారు. వేసిన పంటలు నాశనం కావడమే కాకుండా ఇసుక మేటలు వేయడంతో తాము సాగు చేసుకోవడం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మేట ప్రభావంతో ఎక్కువగా పెద్దపల్లి జిల్లాలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలోని ముత్తారం, మంథని సమీపంలోని ఇసుక రీచుల వల్ల వందాలాది ఎకరాల భూముల్లో సాగు చేసే పరిస్థితి లేకుండా పోయిందని రైతాంగం వాపోతోంది.
హెచ్చరికలు వచ్చినా…
వాతావారణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేస్తూ వచ్చింది. భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది… తుపాన్లు వచ్చే అవకాశం ఉందని పదే పదే హెచ్చరించినప్పటికీ నది నుండి స్టాక్ యార్డులకు తరలించిన ఇసుకను వెంటనే విక్రయించేందుకు చొరవ చూపిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు జాగ్రత్తగా ఇసుకను నది నుండి సేకరించినప్పటికీ దానికి సేఫ్టీ ప్లేస్ కు తరలించుకున్న మిగతా పంట భూముల్లో మేటలు వేసే అవకాశం లేకుండా పోయేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మైనింగ్ పై బ్యాన్ లేదా..?
మానేరు నది ప్రవహిస్తున్న పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవద్దని గ్రీన్ ట్యిబ్యూనల్ ఆదేశించినా ఇక్కడి స్టాకు యార్డుల్లో ఇసుక నిల్వలు ఎలా ఉన్నాయన్నదే అంతు చిక్కకుండా పోతోంది. స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక అమ్ముకోవచ్చని, మైనింగ్ చేయడం లేదని వాదనలు తెరపైకి తీసుకొచ్చిన అధికారులు నిత్యం స్టాక్ యార్డుల్లోకి ఇసుక ఎక్కడి నుండి వచ్చి చేరుతుందోనన్న మిస్టరీని ఛేదించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఓ వైపున గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసు నడుస్తున్నప్పటికీ పెద్దపల్లి జిల్లాలో ఇసుక తవ్వకాలు జరపడం వెనక ఆంతర్యం ఏంటో అధికారులకే తెలియాలి. ఇటీవల వచ్చిన వరదలు మానేరులో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తేటతెల్లం చేశాయి. మంథని మండలం గోపాలపురంలో రీచులో కార్మికులు చిక్కుకోవడం, ఒక యువకుడు గల్లంతయి సేఫ్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వరద ఉధృతికి మిషనరీ కూడా కొట్టుకపోయిందంటే మానేరు నదిలో మైనింగ్ కార్యకలాపాలు జరగనట్టయితే మిషనరీ అక్కడ ఎందుకున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. యధేచ్ఛగా మైనింగ్ కార్యకలాపాలు పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్నాయని విషయం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా ఇసుక స్టాక్ యార్డుల వల్ల భూములు లీజుకు ఇవ్వని భూముల్లో కూడా మేటలు వేయడంతో రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.