Kaleshwaram sand: ఇసుక లారీల పార్కింగ్ అడ్డాగా గ్రావిటీ కెనాల్

పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు…

దిశ దశ, కాళేశ్వరం:

ఇసుక రీచుల వద్ద అసలేం జరుగుతోంది..? కాళేశ్వరం ప్రాజెక్టు గ్రావిటీ కెనాల్ ఇసుక లారీలకు ఎలా ఉపయోగపడుతోంది..? భవిష్యత్తులో కెనాల్ ధ్వంసం అయినట్టయితే బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుంది..? ఇరిగేషన్ అధికారులు పట్టించుకోని వైఖరి అవలంభించడానికి కారణమేంటీ అన్నదే అంతుచిక్కకుండా పోతోంది.

లారీల క్యూ…

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా గ్రావిటీ కెనాల్ నిర్మించారు. ఈ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీని నింపాలని ఇరిగేషన్ అధికారులు సంకల్పించారు. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయ్యేవరకు కూడా ఈ గ్రావిటీ నుండి నీటిని తరలించే ప్రక్రియ కొనసాగింది కూడా. అయితే మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు పిల్లర్ కుంగిపోవడంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి (NDSA) క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మూడు కూడా ఒకే డిజైన్ తో నిర్మించారని వాటిలో బ్యాక్ వాటర్ నిలువ ఉంచవద్దని సూచించడంతో ఇరిగేషన్ అధికారులు నీటిని వదిలేస్తున్నారు. దీంతో అన్నారం బ్యారేజీ సమీపంలో భారీగా ఇసుక మేటలు వేసిందని గుర్తించిన ఇరిగేషన్ అధికారులు అక్కడ రీచులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో అన్నారం బ్యారేజీ దిగువ ప్రాంతంలో ఇసుక రీచులను ఏర్పాటు చేసిన TGMDC ఇసుక తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ రీచుల వద్దకు ఇసుక కోసం వస్తున్న లారీలను కన్నెపల్లి, అన్నారం గ్రావిటీ కెనాల్ రోడ్డుపై ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలను పార్కింగ్ చేయిస్తున్నారు. వాస్తవంగా TGMDC ప్రతి రీచు వద్ద కూడా పార్కంగ్ కోసం ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ అన్నారం సమీపంలోని గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన రీచుల వద్ద పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో లారీలన్ని కూడా గ్రావిటీ కెనాల్ రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. కెనాల్స్ పర్యవేక్షించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రతి చోట కూడా రహదారుల నిర్మాణం చేస్తుంటారు. రైతులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులు నాలుగు చక్రాల వాహనాలు తిరిగేందుకు అనుమతిస్తారు. కానీ కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ విషయంలో మాత్రం నిరభ్యంతరంగా భారీ వాహనాలు పార్కింగ్ చేయిస్తుండడం గమనార్హం. హెవీ వెహికిల్స్ తిరగడం వల్ల కెనాల్ రోడ్డు డ్యామేజీ కావడంతో పాటు ఓవర్ బర్డెన్ కారణంగా కాలువ సైడ్ వాల్స్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇరిగేషన్ అధికారులు కెనాల్ రోడ్డును పార్కింగ్ ప్లేస్ గా మార్చుకున్నప్పటి్కీ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం విడ్డూరంగా ఉంది. నీటి పారుదల శాఖ నిబంధనల ప్రకారం కెనాల్స్ రోడ్లను వినియోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంటారు. కానీ అన్నారం గ్రావిటీ కెనాల్ విషయంలో మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

ఆ వంతెనలూ…

ఇకపోతే అన్నారం గ్రావిటీ కెనాల్ రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే దామెరకుంట నుండి అన్నారం బ్యారేజీ దిగువ వరకు నిర్మించిన సపరేట్ ఛానెల్ వంతెనలపై భారం పడుతోంది. దామెరకుంట గ్రామ సమీపం నుండి ప్రవహిస్తున్న పెద్ద వాగు నీటిని ఆరెంద, మల్లారం సమీపంలో కలపకుండా ప్రత్యేకంగా అన్నారం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ లోకి తరలించే విధంగా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ కాలువపై రాకపోకలు సాగించేందుకు కొన్ని చోట్ల వంతెనలు నిర్మించారు. అలాగే అన్నారం గ్రావిటీ కెనాల్ పారకం నీరు బ్యారేజీకి అనుసంధానం చేసిన అధికారులు వాహనల కోసం వంతెన నిర్మించారు. ఈ కెనాల్స్ మీదుగా ప్రత్యేకంగా బ్రిడ్జిలను నిర్మించారు ఇరిగేషన్ అధికారులు. అయితే ఈ కెనాల్స్ వంతెనల మీదుగానే ఇసుక లారీల రాకపోకలు సాగిస్తుండడంతో ఓవర్ లోడ్ కారణంగా అవి దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. వందల సంఖ్యలో నడుస్తున్న ఇసుక లారీల భారం వల్ల వంతెనలు దెబ్బతిన్నట్టయితే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. వీటిని తిరిగి బాగు చేయించేందుకు అధికారులు నిధులు కెటాయించకతప్పని పరిస్థితే ఉంటుంది. అయినప్పటికీ వీటిపై ఇసుక లారీల రాకపోకలను నిషేదించకపోవడం విస్మయం కల్గిస్తోంది. దీనివల్ల రీచుల ద్వారా వచ్చే ఆదాయం అంతా వీటి మరమ్మత్తులకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇసుక లారీల రాకపోకలు, పార్కిగ్ స్థలల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ స్థానికంగా వినిపిస్తోంది.

మరిన్ని వివరాల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి…


You cannot copy content of this page