దిశ దశ, మానకొండూరు:
మృత్యు ఘంటికలు మోగిస్తున్న ఇసుక లారీలను కట్టడి చేయడంలో మాత్రం పట్టించుకునే వారు లేకుండా పోయారు. నదీ తీర ప్రాంతాల్లో ఇసుక లారీల కారణంగా ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసిపోతాయో తెలియని పరిస్థితి తయారైంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన ఓ ఇసుక లారీ తండ్రి కొడుకులను బలి తీసుకోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… మానకొండూరు మండలం రంగంపేట శివారులో సోమవారం రాత్రి ప్రయాణీకులను తరలిస్తున్న ఆటోను ఇసుక లారీ ఢీ కొట్టడంతో తండ్రి కొడుకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మామిడాల పల్లికి చెందిన దర్పల్లి మొగిలి (40), ఆయన కుమారుడు సాయి చంద్ (10) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి తనయులు ఇద్దరిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
కూతురు పుట్టిన మూడు రోజుల్లోనే…
రంగంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరనించిన దర్పల్లి మొగిలి భార్య కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో ప్రసూతి కాగా పండంటి కూతరుకు జన్మనిచ్చింది. రెండు మూడు రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్న మొగిలి మామిడాలపల్లిలోని ఇంటికి వెల్లి తిరిగి భార్య వద్దకు వెళ్లాలనుకుని బయలు దేరారు. కరీంనగర్ నుండి ఆటోలో వెల్తున్న క్రమంలో రంగంపేట సమీపంలో ఇసుక లారీ ఢీ కొట్టడంతో మొగిలి అతని కొడుకు సాయి చంద్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. తన భర్త కొడుకులు ఇంటికి వెల్లి వస్తారని పసిబిడ్డతో ఆసుపత్రిలో ఉన్న ఆ తల్లికి భర్త, కొడుకు చనిపోయాడన్న విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
కట్టడి చేయలేరా..?
ప్రధాన రహదారుల్లో ఇసుక లారీల వేగాన్ని, ఓవర్ లోడ్ ను కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో కూడా లారీలను నియంత్రించకపోవడం పట్ల స్థానికంగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం నుండి లోడింగ్ విధానాన్ని నిలిపివేయాలన్న నిబంధనలు కూడా ఉన్నప్పటికీ వేళాపాళ లేకుండా ఇసుక లారీలు తిరుగుతుండడంపై ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇసుక లారీల రోధనలతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మానకొండూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. తాజాగా రంగంపేట వద్ద ఇసుక లారీ కారణంగా ఆటోలో ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులు మరణించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.