పల్లెలను వణికిస్తున్న ఇసుక లారీలు

అదుపు తప్పి బోల్తా పడిన వైనం

దిశ దశ, హుజురాబాద్:

మానేరు నది పరివాహక ప్రాంత వాసులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. బయటకు వెల్తే క్షేమంగా ఇళ్లు చేరుతామా లేదా అన్న భయంతో కాలం వెల్లదీస్తున్నారు. టీఎస్ఎండీసీ ఏర్పాటు చేసిన రీచుల నుండి ఇసుక తరలిస్తున్న లారీ వాలాలు ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తుండడంతో సమీపంలోని పల్లెల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఆదివారం మద్యాహ్నం వీణవంక మండలం ఐలాబాద్ స్టేజీ వద్ద ఇసుక లారీ సృషించిన హంగామా అంతా ఇంతా కాదు. ఎడమ పక్క నుండి వెళ్లాల్సిన లారీ ఏకంగా రాంగ్ రూట్ కు వెల్లి ఒ శునకాన్ని ఢీ కొట్టడంతో పాటు అదుపు తప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అంతేకాకుండా లారీ ప్రయాణిస్తున్న రోడ్డులో స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం సంభవించలేదని… లేనట్టయితే తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేదని స్థానికులు చెప్తున్నారు. ఈ ఇసుక లారీ చల్లూరు రీచు నుండి జమ్మికుంట వైపునకు వెల్తుండగా ప్రమాదం జరిగింది. లారీ ప్రమాదం గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా గాయాల పాలైన డ్రైవర్ ను అంబూలెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. లారీలను కట్టడి చేసే వారు లేకుండా పోవడంతో తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని మానేరు నది పరివాహక ప్రాంతాల వాసులు అంటున్నారు. లారీ డ్రైవర్లు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తుండడంతో ఎప్పుడు ఏ లారీ కింద పడిపోతామోనన్న భయంతో కాలం వెల్లదీస్తున్నామన్నారు. అధికారులు లారీల వేగాన్ని నియంత్రించేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

You cannot copy content of this page