లారీ యజమానుల వినతి…
దిశ దశ, భూపాలపల్లి:
ఇసుక పాలసీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఇసుక రవాణా చేసే లారీల యజమానులు సరికొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. ఇసుక రీచులలో పాసింగ్ లోడింగ్ విధానం అమలు చేస్తున్నందు ఇసుక లారీల యజమానుల JAC తరుపున హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్తూనే… తమకు జరుగుతున్న నష్టాన్ని కూడా గమనించాలని అభ్యర్థించారు. ఈ మేరకు భూగర్భ గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ కు వినతి పత్రం సమర్పించినట్టుగా ఒక ప్రకటనలో వెల్లడించారు. RCలో ఉన్న రికార్డుల ప్రకారం లోడ్ చేయడం వల్ల లారీకి 2 టన్నుల మేర నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 16 టైర్ల లారీ ఫుట్ వెయిట్ 47.500 టన్నులుగా ఆర్సీలో ఉంటుందని, అందులో 14.500 టన్నులు లారీ బరువు ఉంటుందని వివరించారు. 35 టన్నులకు తాము TGMDCకి డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ 33 టన్నులు మాత్రమే లోడ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆర్సీ బుక్ రికార్డుల ఆదారంగా లోడింగ్ చేసినట్టయితే తాము TGMDCకి అదనంగా రెండు టన్నుల ఇసుకకు సీనరేజీ చెల్లించాల్సి వస్తుందని వివరించారు. తాము TGMDCకి ఆన్ లైన్ లో 35 టన్నలుకు డబ్బులు చెల్లిస్తున్నందున లారీ బరవుతో కలిపి 49.500 టన్నులకు అనుమతించాలని కోరుతున్నారు. లేనట్టయితే 33 టన్నులకే TGMDC ఆన్ లైన్ లో సీనరేజ్ చార్జెస్ తీసుకునే విధంగా అయినా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.35 టన్నుల ఇసుక లోడింగ్ అనుమతి ఇచ్చినట్టయితే 49.500 టన్నుల ఇసుక తరలిస్తున్న లారీలకు మినహాయింపు ఇచ్చే విధంగా అయినా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయా విభాగాలకు, మెబైల్ టీమ్స్ కు ఆదేశాలు ఇవ్వాలని లారీ యజమానల సంఘ జేఏసీ కోరింది. అలాగే డెలివరీ అడ్రస్ సాకుతో అడ్డాల వద్దకు వచ్చి లారీలను తీసుకుని వెల్తున్నారని దీనివల్ల మార్కెట్లో ఇసుక ధర టన్నుకు 3 వేల వరకు పెరిగినా ఆశ్యర్యపోవల్సిన అవసరం లేదన్న విషయం గమనించాలని కోరారు. న్యాయంగా ఇసుక తరలిస్తున్న లారీల యజమానులకు అన్యాయం జరగకుండా చూడాలని జేఏసీ కోరింది.