ఇసుకే బంగారమాయేనే…

హుజురాబాద్ వాసుల ఇక్కట్లు…

దిశ దశ, కరీంనగర్:

హుజురాబాద్ ప్రాంతంలో సామాన్యులు మరో కష్టం ఎదుర్కొంటున్నారు. తమ కలల సౌధాలు నిర్మించుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు ఇసుక వ్యాపారులు. స్థానిక అవసరాలకు ఇసుక అమ్మకాలు జరిపే వారు ఉన్నట్టుండి ధరలు పెంచేయడంతో ఇంటి నిర్మాణం చేయాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. కారణం ఏదైనా బలవుతున్నది మాత్రం సగటు పౌరుడే.

ధరలు ఇలా…

నిన్న మొన్నటి వరకు ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ. 2500 నుండి రూ. 3 వేల ధర పలికేది. ఇసుక రీచుల ఏర్పాటుతో స్థానికులు ఇండ్లు కట్టుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ధర పెట్టి చెల్లించే వారు. తమ వ్యక్తిగత అవసరాలకు ఇసుక సేకరించుకోవడానికి రెవెన్యూ అధికారులు వే బిల్లులు జారీ చేస్తున్నప్పటికీ ఇందుకు ట్రాక్టర్ వాలాలు ముందుకు రావడం లేదు. దీంతో నల్ల బజారులో అమ్మేవారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి హుజురాబాద్ వాసులకు ఎదురైంది. అయితే తాజాగా ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 6 వేల వరకు ధర పెంచడంతో ఇంటి నిర్మాణం చేస్తున్న వారి దిమ్మ తిరిగిపోతోంది. మార్కెట్ లో లభ్యమవుతున్న ఇసుక ధరలను అంచనా వేసుకుని ఎంత ఖర్చవుతుందోనని లెక్కలు వేసుకున్న ఇంటి యజమానులకు షాకిచ్చేవిధంగా ధరలు పెంచేశారు. ఇంతవరకు అమ్మిన ఇసుక ధర ఒక్క సారిగా రెట్టింపు కావడంతో స్థానికులు బెంబెలెత్తుతున్నారు. ఇసుక ధరలు అమాంతంగా పెంచేయడంతో ఏం చేయాలో అర్థం కాక కొత్తగా ఇండ్లు కట్టుకుంటున్న వారు తలలు పట్టుకుంటున్నారు. ఇసుక కొనుగోలు చేసుకునేందుకు అదనంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి తయారైందన్న ఆవేదన హుజురాబాద్ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతోంది.

బ్లాక్ మార్కెట్ కు కారణం..?

అయితే ఇసుక ట్రాక్టర్లు నడకుండా అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంతకాలం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించిన అధికారులు ట్రాక్టర్ వాలాలపై ఉక్కు పాదం మోపడానికి కారణలేంటన్న చర్చలు సాగుతున్నాయి. హుజురాబాద్ మీదుగా ప్రవహిస్తున్న నదుల నుండి ఇసుక అమ్మే వారు కూడా ఒక్క సారిగా తెరమరుగై పోయారు. ఒకరిద్దరు మాత్రమే ఈ దందా చేస్తుండడంతో వారు బ్లాక్ మార్కెట్ ధరలు చెప్తున్నారు. దీంతో నూతన ఇండ్ల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఉన్నట్టుండి ఇసుక ధరలు ఒక్కసారిగా పెరిగడానికి కారణాలేంటన్న విషయంపై తర్ఝనభర్జనలు సాగుతున్నాయి. స్థానికంగా ఉన్న ప్రచారాన్ని బట్టి ఓ నాయకుడు తనకు నెలవారి మామూళ్లు కావాలన్న అంశం తెరపైకి తీసుకరావడం… గ్రామాల వారిగా నెల నెల మామూళ్లు ఇవ్వాలన్న డిమాండ్ కు ట్రాక్టర్ వాలాలు తలొగ్గకపోవడంతో ఇసుక దందాపై కన్నెర్రజేస్తున్నారని తెలుస్తోంది. ఒకరిద్దరు అధికారుల ఇలా చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకులతో చిక్కులు ఎదర్కోవడం ఎందుకని చాలామంది కిమ్మనడం లేదని కూడా అంటున్నారు స్థానికులు. సామాన్యులపై ప్రత్యక్ష్యంగా ప్రభావం పడుతున్న ఈ తతంగం గురించి నియోజకవర్గం అంతా కూడా చర్చ తీవ్రంగా సాగుతోంది. అయితే ఈ విషయంపై సామన్యులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మనసులోనే నిందిస్తున్నారు. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో ఇలాంటి వ్యవహారాలు అధికార పార్టీపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉన్నందున అధిష్టానం కూడా కట్టడి చేయాల్సిన అవశ్యకత ఉందన్న అభిప్రాయాుల కూడా వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page