రీచులు క్లోజ్… వేబిల్లులు రిలీజ్…
దిశ దశ, కరీంనగర్:
మానేరు నది పరివాహక ప్రాంతంలో ఇసుక రీచులను మూసేసిన విషయంలో సరికొత్త సమస్య తయారైంది. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఇసుక రీచుల వద్దకు లోడింగ్ కోసం లారీలు వస్తూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రమే రీచులను క్లోచ్ చేయాలని వివిధ శాఖల అధికారులు ఆధేశించడంతో అధికారులు అన్ని మూసివేశారు. అంతేకాకుండా రీచుల వద్ద ఉన్న లారీలను కూడా తిప్పి పంపడంతో ఇసుక లోడింగ్ విధానానికి కూడా బ్రేకులు పడినట్టయింది. అయితే మంగళవారం కూడా ఇసుక కోసం సుదూర ప్రాంతాల నుండి లారీలు మానేరు నది వద్దకు చేరుకుంటుండడం గమనార్హం. దీంతో లారీవాలాలు ఆకలికి అలమటిస్తూ రీచుల వ్ద పడిగాపులు కాస్తున్నారు. లారీ యజమానులు ఇసుక లోడ్ చేసుకుని రావాలని పంపించారని, సైట్ వద్దకు వస్తే లోడింగ్ చేయడం లేదంటూ మండిపడుతున్నారు.
సమన్వయం లేకనేనా..?
కరీంనగర్ జిల్లా మానేరు నదిలో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవద్దంటూ సుప్రీం కోర్టు స్టే విధించింది. మళ్లీ విచారణ తేది వరకు ఇలాగే కొనసాగించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తారా లేదా అన్న చర్చ సాగుతున్న క్రమంలో కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి కర్ణన్ సోమవారం ఉదయం నుండి రివ్యూ జరిపి రీచులను మూసి వేయాలని ఆదేశించారు. దీంతో సోమవారం సాయంత్రం నుండి ఇసుక రవాణాకు ఎక్కడికక్కడ బ్రేకులు పడ్డాయి. అయితే సోమవారం జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం టీఎస్ఎండీసీ కూడా ఇసుక కోసం డీడీలు చెల్లించిన వారికి వే బిల్లులు జారీ చేయడంతో మంగళవారం కూడా లారీలు రీచుల బాట పట్టాయి. దీంతో కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలంలోని పలు రీచుల వద్దకు చేరుకున్న లారీలకు ఇసుక లోడ్ చేయడం లేదని చెప్తుండడంతో షాకుకు గురవుతున్నారు. ఈ సమాచారం ముందుగానే ఇస్తే తాము హైదరాబాద్ కు పరిమితం అయ్యే వారం కదా… అల్లంత దూరం నుండి వచ్చిన తరువాత లోడింగ్ చేయడం లేదనడం ఎంతవరకు సమంజసం అంటూ డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. తీరా రీచుల వద్దకు చేరుకున్న తరువాత రీచులన్ని మూసివేసి ఉండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ సోమవారం రీచులను మూసేయాలని ఆదేశాలు జారీ చేసిన తరువాత క్షేత్ర స్థాయిలో వెల్లి చెప్పేందుకు రెవెన్యూ, మైనింగ్ పోలీసు విభాగాలను కూడా వెళ్లాలని సూచించారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు సోమవారం సాయంత్రం జిల్లాలోని ఎనిమిది రీచుల వద్దకు వెల్లి ఇసుక లారీలను తిప్పి పంపించి లోడింగ్, మైనింగ్ ప్రక్రియ ఆపాలని నిర్వహాకులకు తెలిపారు. అయితే ఈ విషయం గురించి టీఎస్ఎండీసీ ఏ మాత్రం పట్టించుకోకుండా మంగళవారం కూడా డీడీలు తీసుకుని వే బిల్లులు విడుదల చేయడం విస్మయం కల్గిస్తోంది. ఆన్ లైన్ ప్రక్రియలో సాగిన ఈ తంతు ప్రక్రియలో టీఎస్ఎండీసీ అధికారులకు కరీంనగర్ జిల్లా అధికారులు సమాచారం ఇవ్వలేదా లేక కావాలనే డీడీలను పంపించారా అన్నదే మిస్టరీగా మారిపోయింది. జిల్లా యంత్రాంగం, టీఎస్ఎండీసీకి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే లారీలు మంగళవారం కూడా ఇసుక లోడింగ్ కోసం మానేరు రీచుల వద్దకు చేరుకున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సుప్రీం కోర్టు ఉత్తర్వులు..?
ఇదే సమయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను కూడా టీఎస్ఎండీసీ తుంగలో తొక్కి వేబిల్లులు జారీ చేయడం వెనక ఆంతర్యం ఏంటన్న వాదనలు లేవనెత్తుతున్నారు మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు. సుప్రీ ఉత్తర్వులు ఇచ్చి వారం రోజులు అవుతోందని జులై 10న జరగనున్న విచారణ వరకు మానేరులో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టవద్దన్న ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని కట్టడి చేయకుండా వ్యవహరించడం వెనక ఆంతర్యం ఏంటన్న ప్రశ్నను కూడా సంధిస్తున్నారు. ఏది ఏమైనా మానేరు ఇసుక తవ్వకాల వ్యవహారం మాత్రం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది.