ముగ్గురు సంజయ్ ల ముచ్చట…

దిశ దశ, కరీంనగర్:

అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ముగ్గురు అభ్యర్థులు అందరినీ పరిషాన్ చేస్తున్నారు. వేర్వేరు పార్టీల తరుపున వేర్వేరు స్థానాల నుండి పోటీ చేస్తున్నప్పటికీ వీరి పేర్లు మాత్రం ఒకటే కావడంతో కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొంత తికమకపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రచారం చేస్తున్న నాయకులు కూడా అభ్యర్థుల పేర్లు ఉచ్ఛరించేప్పుడు జాగ్రత్తలు తీసుకోవల్సి వస్తోంది. కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్, జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్లలో బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్నది కూడా డాక్టర్ సంజయ్ కుమార్ కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సంజయ్ లు బరిలో నిలవడంతో ఫలాన సంజయ్ అని ప్రత్యేకంగా పేర్లను ప్రస్తావించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి ఓ సంజయ్ పేరు ఉచ్చరించాల్సి నప్పుడు మరో సంజయ్ పేరు చెప్తున్న వారూ లేకపోలేదు. ఈ పరిస్థితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఎదురు కావడం గమనార్హం. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ తరుపున ప్రచారం చేస్తున్న క్రమంలో ఆమె బండి సంజయ్ పేరు పలికారు. వెంటనే బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ ఆమెను అప్రమత్తం చేయడంతో డాక్టర్ సంజయ్ పేరును పలికారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో రెండు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఒకటి కావడం, ఇద్దరూ డాక్టర్లే కావడంతో కనఫ్యూజ్ అవుతుండగా వీరికి కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తోడయ్యారు. దీంతో ఎన్నికల వాతావరణం, ఓటర్ల మనోగతంపై చర్చలు జరుగుతున్నప్పుడు కూడా ప్రత్యేకంగా పలానా అభ్యర్థి సంజయ్ అని వివరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

You cannot copy content of this page