బొమ్మల రామారం నుండి ‘బండి’ తరలింపు

హై కోర్టులో బీజేపీ పిటిషన్..?

బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్

దిశ దశ, హైదరాబాద్:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై హైకోర్టును ఆశ్రయించారు. హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మంగళవారం అర్థరాత్రి కరీంనగగర్ జ్యోతినగర్ లో బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బొమ్మల రామారం స్టేషన్ కు తరలించారని, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియజేయడం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించినట్టుగా సమాచారం.

కోర్టుకు తరలింపు…

మరో వైపున బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు బయటకు తీసుకెళ్లారు. ఆయన్ని కోర్టులో హాజరు పర్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సంజయ్ పై కేసు నమోదు చేశామని యాదాద్రి జిల్లా పోలీసులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ని కోర్టుకే తరలిస్తున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. భువనగిరి కోర్టుకు తరలించానుకున్నప్పటికీ అక్కడ జడ్జిలు అందుబాటులో లేకపోవడంతో జనగామ కోర్టుకు కానీ వరంగల్ కోర్టుకు కానీ తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే సంజయ్ పై ఏఏ సెక్షన్లలో కేసు నమోదు చేశారన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అయితే బండి సంజయ్ తరుపున హై కోర్టులో పిటిషన్ వేశారన్న సమాచారం అందుకున్న తరువాత పోలీసులు హడావుడిగా కోర్టుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు బీజేపీ నాయకులు చేస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్…

బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. శామీర్ పేట్ లోని ఈటల నివాసంలో ఉన్నప్పుడు పోలీసులు ఇంటి నుండి బయటకు రాకూడదని, సంజయ్ కోసం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెల్లవద్దని సూచించారు. అయితే ఈటల రాజేందర్ నాంపల్లి కోర్టుకు వెల్లే ప్రయత్నంలో ఇంటి నుండి బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించారు. బొమ్మల రామారం ఠాణాలో ఉన్న సంజయ్ ని కలిసేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లగా ఆయన్ని పోలీసులు అడ్డుకోవడంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రఘునందన్ రావును కూడా అరెస్ట్ చేసిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు మాత్రం స్టేషన్ నుండి బండి సంజయ్ ని తరలిస్తున్న విషయం గమనించి పోలీసు వాహనాల కాన్వాయి వెంట పరిగెత్తారు.

You cannot copy content of this page