బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
దిశ దశ, హైదరాబాద్:
నిప్పు లేనిదే పొగరాదంటారు కానీ… కొన్ని ఛానెళ్లు ఏడాది కాలంగా నన్ను మారుస్తున్నారంటు ప్రచారం చేస్తునే ఉన్నాయి కానీ అక్కడ నిప్పూలేదు… పొగ రావడం లేదు అంటూ వ్యంగోక్తి విసిరారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం బండి సంజయ్ ని మారుస్తున్నారని ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో బెర్త్ ఖరారైందని, ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించుకుందని మీడియాలో ఉదయం నుండి వార్తలు వచ్చాయి. అయితే విస్తారక్ లను ఆహ్వానించేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న బండి సంజయ్ ని ఈ విషయంపై మీడియా అడిగినప్పుడు పై విధంగా స్పందించారు. అధ్యక్షుడిని మార్చే విషయం గురించి అయితే తనకు తెలియదని జాతీయ అధ్యక్షుడు నడ్డాను అడిగి మీడియాకు చెప్తానంటూ వ్యాఖ్యానించారు సంజయ్. పార్టీ ఇంఛార్జీ తరుణ్ ఛుగ్ తో పాటు జాతీయ నాయకులు పలు మార్లు నాయకత్వ మార్పు లేదని పలుమార్లు స్పష్టతనిచ్చినప్పటికీ పదే పదే తనను మారుస్తున్నారంటూ లేనిపోని ప్రచారం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది, రాసి రాసి మీకూ అలవాటైపోయిందంటూ బండి తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖంగా ఆలోచించి సొంత పార్టీని పక్కన పెట్టి పక్క పార్టీలో పొగబెట్టాలని చూస్తున్నాడని, డబ్బు, అధికార మదంతో విర్రవీగుతూ ఇతర పార్టీలను దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ కుట్రలో బాగంగానే తనను మారుస్తున్నారంటూ పదే పదే ప్రచారం చేయిస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని తాము పట్టించుకునేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశానుసారం పార్టీకి సేవలందిస్తూ ముందుకు సాగుతామని వెల్లడించారు.
అలాంటిదేమీ లేదు: కిషన్ రెడ్డి
బీజేపీలో అధ్యక్షుడిని మార్చాలన్న ఆలోచన జాతీయ నాయకత్వానికే లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చామని, రాష్ట్ర నాయకత్వంలో మార్పులు లేవని కుండబద్దలు కొట్టారు. సంజయ్ స్థానంలో మిమ్మల్ని నియమిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోందని మీడియా ప్రతినిధులు అడిగగా తనకావిషయమే తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు.