కస్టడి పిటిషన్ వేసిన పోలీసులు..?
ఖైదీ నెంబర్: 7917
దిశ దశ, కరీంనగర్:
టెన్త్ పేపర్ మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో కుట్ర కేసులో బుధవారం అరెస్ట్ అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. వరంగల్ కోర్టులో బండి సంజయ్ ని హాజరు పర్చిన పోలీసులు అతన్ని కస్టడికీ ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సంజయ్ ని కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తుందా లేక బెయిలపై నిర్ణయం తీసుకుంటుందా అన్న విషయంపై ఉత్కంఠంగా మారింది. బీజేపీ లీగల్ టీమ్ అంతా కూడా టెక్నికల్ మిస్టేక్స్ ను ఎత్తి చూపి సంజయ్ కి బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించే అవకాశాలు ఉన్నాయి.
‘బండి’ ఖైదీ నెంబర్ ఇదే
బుధవారం రాత్రి కరీంనగర్ జైలుకు జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించిన సంజయ్ కి కరీంనగర్ జిల్లా జైలు అధికారులు 7917 అనే ఖైదీ నెండర్ అలాట్ చేశారు. నిన్న జిల్లా జైలుకు వెల్లిన సంజయ్ కి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన ఆయన ఆరోగ్యం గురించి జైల్ అధికారులు తెలుసుకున్నట్టు సమాచారం. సాధారణ వ్యక్తులకు ఎంపీ హోదాలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వారికి జైలు నిభందనల్లో ఉన్న సడలింపుల ప్రకారం బండి సంజయ్ ని జైళ్ల శాఖ ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు జైలు అధికారులు నడుచుకోవల్సి ఉంటుంది. అయితే బుధవారం వరంగల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కరీంనగర్ కోర్టుకు చేరుకున్న బండి సంజయ్ తో అతని కుటుంబ సభ్యులను మాట్లాడించేందుకు పోలీసు అధికారులు నిరాకరించారు. అయితే కోర్టు ఆదేశాలతో కరీంనగర్ జైలుకు తరలించిన నేపథ్యంలో సంజయ్ కి సెక్యూరిటీగా వచ్చిన పోలీసులు ఇతర వ్యక్తులతో మాట్లాడించే అధికారం ఉండదని పోలీసులు అటున్నారు. అతన్ని కరీంనగర్ జైలుకు తరలించిన తరువాత నిభందనల ప్రకారం జైలు అధికారులు ములాఖాత్ కు అనుమతించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
151 సీఆర్సీసీ అంటే…
అయితే మంగళవారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో కరీంనగర్ పోలీసులు జ్యోతినగర్ లోని బండి సంజయ్ ని క్రైం నెంబర్ 147లో 151 సీఆర్పీసీ కింద ముందస్తు అరెస్ట్ చేశామని పోలీసులు ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్ల లీకేజీపై బండి సంజయ్ పలుచోట్ల నిరసనలకు పిలుపునిచ్చారని దీనివల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతారన్న కారణంతో మందస్తు అరెస్ట్ చేసినట్టు ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే 151 సీఆర్పీసీ కింద పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి 24 గంటల పాటు తమ కస్టడీలో ఎవరినైనా పెట్టుకునే అధికారం ఉందని చట్టం చెప్తోంది. ఈ చట్ట ప్రకారమే పోలీసులు 151 సీఆర్పీసీ కింద అరెస్ట్ చేశారని, అయితే 24 గంటలు దాటితే మాత్రం కోర్టు అనుమతి తీసుకోవల్సి ఉంటుందని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ నిభందనల మేరకే బండి సంజయ్ ను కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారని స్ఫష్టం అవుతోంది. అయితే 151 సీఆర్పీసీ కింద ఎంపీ బండి సంజయ్ ని ప్రివెంట్ అరెస్ట్ చేయవచ్చా లేదా అన్న విషయంపై బీజేపీ లీగల్ టీం చట్టాలను లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా సంజయ్ పై 120 బి కుట్ర కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ సెక్షన్ వర్తించదని, పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పిన అంశాలను ఊటంకిస్తూ బీజేపీ లీగల్ టీమ్ బెయిల్ పిటిషన్ పై అర్గ్యూమెంట్స్ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.