సర్దార్జీ @ 1 రూపాయి… ఎమ్మెల్సీ ఎన్నికల నినాదం…

దిశ దశ, కరీంనగర్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సుకత చూపిస్తున్న ఆశావాహులు కార్యరంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో  గెలిచి తీరాలన్న సంకల్పంతో ఉన్న ఆశావాహులు నియోజకవర్గంలో తమ ప్రభావాన్ని చూపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఒక్కో అభ్యర్థి ఒక్కో మార్గాన్ని ఎంచుకుని పట్టభద్రుల్లో తమకు ప్రత్యేక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పొలిటికల్ పార్టీ అండదండలు కూడా ఉన్నట్టయితే బావుంటుందన్న యోచనతో అభ్యర్థులు వారికి అనుబంధం ఉన్న లీడర్లతో టచ్ లోకి వెల్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ సరికొత్త పల్లవి అందుకున్నారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియపై పార్టీ దృష్టి సారించకముందే తనవంతు ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్న రవిందర్ సింగ్ పట్టభద్రులను ఆకట్టుకునేందుకు సరికొత్త నినాదం అందుకున్నారు. అర్హులైన పట్టభద్రులందరికి కూడా 1 రూపాయికే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకముందే దూకుడు ప్రదర్శిస్తున్న రవిందర్ సింగ్ హామీల పరంపరంకు తెరలేపారు. కేవలం 1 రూపాయికే ఇన్సూరెన్స్ చేయిస్తానంటూ ఇచ్చిన నినాదం సంచలనంగా మారింది.

ఆయన స్టైలే అంతా…

ఒక రూపాయికే స్కీమ్స్ అమలు చేయడంలో రవిందర్ సింగ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కరీంనగర్ మేయర్ గా పని చేసిన ఆయన ఏక్ రూపియా స్కీమ్స్ కు తెరలేపారు. అంత్యక్రియలు జరిపించేందుకు ఆర్థికంగా లేని నిరుపేదలు రూ. 1 రూపాయి చెల్లిస్తే చాలు బల్దియా నిధులతో ఆఖరీ సఫర్ కార్యక్రమం చేపడుతామని ప్రకటించారు. అలాగే ఒక రూపాయికే నల్లా కనెక్షన్ పేరిట మరో పథకాన్ని అమలు చేశారు. అంతేకాకుండా సానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులోకి తెచ్చేందుకు కాలేజీలతో పాటు పలు విద్యా సంస్థల్లో కూడా సానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా 1 రూపాయికే సానిటరీ న్యాప్ కిన్స్ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 1 రూపాయికే ఇన్సూరెన్స్ స్కీం అంటూ సరికొత్త నినాదంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

You cannot copy content of this page