పదవి కాలం ముగిసినా పరేషాన్ తప్పడం లేదు…

ఆత్మహత్య చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వండి

దిశ దశ, మానకొండూరు:

పదవి కాలం ముగిసినప్పటికీ తమను అప్పులు వెంటాడుతూనే ఉన్నాయని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇస్తున్నారు కానీ తమ పెండింగ్ బిల్లులు మాత్రం మంజూరు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుస్తెలు కుదువ పెట్టి పస్తులుంటున్నా తమను పట్టించుకునే వారే లేకుండా పోయారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని ఓ సర్పంచ్ ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని తిమ్మాపూర్ మండల పరిషత్ ఆఫీసు వద్దకు సోమవారం పురుగుల మందు డబ్బాతో మన్నెంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య చేరుకున్నారు. అప్పులు ఊబిలో కూరుకపోయిన తాను ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన అభ్యర్థించేందుకు వచ్చారు. సర్పంచ్ గా వ్యవహరించినప్పడు గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన బిల్లులు నేటికీ ఇవ్వలేదన్నారు. ఆయా పనులు సకాలంలో పూర్తి చేయాలని అప్పుడు తమపై ఒత్తిడీ చేయడంతో అప్పులు చేసి మరీ కంప్లీట్ చేశామని అయితే ఇంతవరకు తమకు రావల్సిన బకాయిలు మాత్రం అలాగే ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు బిల్లులు మంజూరు చేయడంలో వివక్ష చూపుతున్నాయని మాజీ సర్పంచ్ అంజయ్య ఆరోపించారు. గ్రామాభివృద్ది కోసం తాము చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేనందున ఆత్మహత్య చేసుకునేందుకు అనమతి ఇవ్వాలన ఆయన డిమాండ్ చేశారు. అయితే ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న పోలీసులు సర్పంచ్ అంజయ్యను నిలవురించి స్టేషన్ కు తరలించారు.

You cannot copy content of this page