దిశ దశ, కరీంగనర్:
మరో 13 రోజుల్లో ముగియనున్న పదవి కాలం విషయంలో సర్పంచులు సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గత ఐదేళ్లలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి తమ పదవి కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడగించాలని కోరుతూ సర్పంచులు వినతి పత్రాలు సమర్పించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 2019 ఫిబ్రవరి 2వ తేదిన బాధ్యతలు తీసుకున్నామని ఈ ఫిబ్రవరి ఒకటో తేదితో తమ పదవి కాలం ముగుస్తుందన్నారు. అయితే తాము బాధ్యతలు నిర్వర్తించామని అయితే గత ఐదేళ్లలో తాము ఎన్నో ఒడి దొడుకులు ఎదుర్కొన్నామని కరీంగనర్ జిల్లా గంగాధర ఎంపీడీఓ పేరిట రాసిన వినతి పత్రంలో వివరించారు. అంతేకాకుండా ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు దాదాపు రెండేళ్ల పాటు కరోనా కూడా తమను వెంటాడిందని సర్పంచులు వివరించారు. 25 నెలల నుండి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రావడం లేదని, అడపాదడపా మినహామిస్తే దాదాపు 14 నెలల నుండి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా అలాట్ కావడం లేదని తెలిపారు. దీంతో నెల నెల జమ కావల్సిన నిధులు పంచాయితీ అకౌంట్లలోకి రాకపోవడంతో పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించలేకపోయామని, అంతేకాకుండా మెయింటనెన్స్ కు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని సర్పంచులు వివరించారు. దీంతో ఆర్థిక వనరులను సమీకరించుకునేందుకు తాము అప్పులు చేయవల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏనాడూ కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులు సర్పంచులు ఎదుర్కోలేదని ఈ సారి మాత్రమే గెలిచిన సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకపోయారన్నారు. తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి అదనంగా రెండేళ్ల పాటు తమ పదవి కాలాన్ని పొడగించాలని సర్పంచులు అభ్యర్థిస్తున్నారు. తమకు చెక్ పవర్ కూడా బాధ్యతలు తీసుకున్న తరువాత 9 నెలలకు ఇచ్చారని దీనివల్ల కూడా నిధులను సమీకరించుకునేందుకు ఇబ్బందులు పడ్డామన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రెండేళ్ల పాటు తమ పదవి కాలన్ని పొడగించినట్టయితే బావుంటుందన్న ప్రతిపాదన చేస్తున్నారు సర్పంచులు. 1994లో అప్పటి ప్రభుత్వం రెండేళ్ల పాటు పర్సన్ ఇంఛార్జిలుగా సర్పంచులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమలు చేయాలని సర్పంచులు కోరుతున్నారు.