అంతర్థానం కానున్న మరో చారిత్రాత్మక ప్రదేశం..?

అడ్డుకున్న బహుజనులు

దిశ దశ, కరీంనగర్:

16వ శతాబ్దాపు పోరాట యోధుడు… ప్రపంచంలోనే పేరొందిన విప్లవకారుని చారిత్రాత్మక ప్రాంతంపై గ్రానైట్ వ్యాపారుల కళ్లు పడ్డాయా..? అలనాటి పోరాట పటిమకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఆ ప్రాంతం త్వరలో కనుమరుగు కానుందా..? అంతర్జాతీయ సమాజం గుర్తించిన ఆ యోధుడి పరిపాలన కేంద్రానికి స్కెచ్ వేశారా అంటే అవుననే అనిపిస్తున్నాయి… నేడు జరిగిన పరిణామాలు గమనిస్తే.

సర్వాయి పాపన్న కోటకు ఎసరు…

కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం సర్వాయిపేటలో ఉన్న సర్దార్ సర్వాయిపాపన్న రాజధానిగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతంపై గ్రానైట్ వ్యాపారులు కన్నేసినట్టుగా తెలుస్తోంది. బుధవారం వివిధ శాఖల అధికారులు సర్వాయిపేటలో హద్దులపై సర్వే చేస్తున్న విషయం తెలుసుకున్న బహుజన బిడ్డలు అడ్డుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు కూడా అక్కడకు చేరుకుని సర్వేను అడ్డుకున్నారు. దీంతో సర్వే కోసం వెల్లిన అధికారులు వెనుదిరిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే మరోసారి కూడా అధికారులు సర్వే కోసం వెల్తున్న సమాచారం అందుకున్న నిరసన కారులు సర్వాయిపేట గుట్టల వద్దకు చేరుకుంటున్నారు.

టాప్ టెన్ విప్లవకారుడు…

సర్దార్ సర్వాయి పాపన్న 16వ శతాబ్దాంలో టాప్ టెన్ విప్లవకారునిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఔరంగజేబు నుండి గోల్కొండ ఖిల్లాను స్వాధీనం చేసుకున్న పాపన్న తైల వర్ణ చిత్రాలతో పాటు, చరిత్ర కూడా అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చాయి. లండన్ లో సర్వాయి పాపన్న చరిత్ర గురించి లిఖించబడి ఉందంటే ఆయన పోరాటపటిమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆనాడు తన సామ్రాజ్యాన్ని పరిపాలించేందుకు ఏర్పాటు చేసుకున్న సర్వాయిపేట గుట్టలతో పాటు అనుసంధానంగా ఉన్న కొన్ని గుట్టలను గ్రానైట్ వ్యాపారులకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వేలు కూడా జరపుతున్నారన్న సమాచారం అందుకున్న పలువురు అక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న స్థావరాలకు సంబంధించిన గుట్టలను గ్రానైట్ వ్యాపారులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని ఆందోళన కారులు తేటతెల్లం చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా చేయాలని ఓ వైపున డిమాండ్ చేస్తుంటే గ్రానైట్ వ్యాపారులకు గుట్టలు కట్టబెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కలర్ సత్తన్న, మార్వాడి సుదర్శన్, కరీంనగర్ జిల్లా బీసీ సెల్ ఛైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తో పాటు పలువురు ఆందోళనకారులు పాల్గొన్నారు.

నెల తిరగక ముందే…

ఆగస్టు 18నే సర్వాయి పాపన్న జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 1650 ఆగస్టు 18న జన్మించినట్టుగా శాసనాల ద్వారా గుర్తించిన చరిత్రకారులు ఏటా ఆయన బర్త్ డే నిర్వహిస్తున్నారు. గత ఆగస్టు 18న రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు నిర్వహించిన నెల రోజులు కూడా గడవక ముందే గ్రానైట్ వ్యాపారులకు ఆయన స్ధావరాలు అయిన గుట్టలు అప్పగించేందుకు నడుం బిగించడం విస్మయానికి గురి చేస్తోంది.

You cannot copy content of this page