సావర్కర్ జయంతి నాడు స్వాతంత్ర్య సమర యోధుల దినోత్సవమా..?

మహా సర్కార్ పై మావోయిస్టుల ఫైర్

దిశ దశ, దండకారణ్యం:

మహారాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమ చరిత్రను రూపుమాపే కుట్ర చేస్తోందని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. హిందుత్వ శక్తులు తమ ఆది గురువైన సావర్కర్ ను సమాధి నుండి తవ్వి తీసి స్వాతంత్ర్య సమర యోధుల సరసన చేర్చి, బ్రిటీష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల చరిత్రను నిట్టనిలువునా సమాధి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని మండి పడింది. ఈ మేరకు దండకారణ్య పశ్చిమ సబ్ జోన్ బ్యూరో, గడ్చిరోలి అధికార ప్రతినిధి శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28న స్వాతంత్ర్య యోధుల గౌరవ దినంగా పాటించాలని నిర్ణయించడంపై ఆయన ఆక్షేపించారు. ఆ రోజును మహారాష్ట్ర సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దినం పాటించాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వాతంత్యోద్యమంలో పాల్గొన్న సావర్కర్ అండమాన్ లోని కాలాపాని జైల్ జీవితం గడిపినప్పుడు బ్రిటీష్ పాలకులను క్షమా భిక్ష కోరి బయటకు వచ్చాడన్నారు. ఆ తరువాత యూటర్న్ తీసుకున్న సావర్కర్ ఒకే దేవుడు, ఒకే లక్ష్యం, ఒకే జాతి, ఒకే జీవితం, ఒకే భాష అన్న మంత్రాన్ని ఉచ్చరించాడన్నారు. ఓ వైపున భారత స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో పలుమార్లు బ్రిటీష్ ప్రభుత్వాన్ని క్షమా భిక్ష వేడుకుని బయటకు వచ్చాడని తెలిపారు. 50 ఏళ్ల జైలు శిక్షలో దాదాపు 38 ఏళ్ల పాటు మినహాయింపు పొందాడని, హిందూ ముస్లింల మధ్య విద్వేశాలు లేపుతూ బ్రిటీష్ పాలకులతో పాటు గొంతుకలిపాడాని, ఇలాంటి దేశ ద్రోహ చరిత్ర కలిగిన సావర్కర్ జయంతి రోజున సమర యోధుల దినంగా పాటించడం సరి కాదని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధుడికి వెన్నుపొటు పొడిచిన చరిత్ర సావర్కర్ దేనని, కాషాయ దండును బ్రిగేడ్ సైన్యంలో చేర్చే ప్రయత్నం చేశాడంటూ మండిపడ్డారు. ఇటువంటి దేశ ద్రోహ చరిత్ర కలిగిన సావర్కర్ జన్మదిన రోజును స్వాతంత్ర్య యోధుల గౌరవ దినం పాటించడం సరికాదన్నారు. మే 28న మహారాష్ట్ర ప్రజలు నిరసన దినాన్ని పాటించాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

You cannot copy content of this page