ఇష్టారీతిన క్లబ్బుల నిర్వహణ…
అన్నల ఇలాకాలో అక్రమ దందా
దిశ దశ, దండకారణ్యం:
సీఎం పేషిలో మా వోళ్లు ఉన్నారు… జిల్లా పోలీసు యంత్రాంగం మా చెప్పు చేతుల్లో ఉంది అంటూ లేనిపోని ప్రచారం చేసుకుంటున్న పేకాట నిర్వహాకుల ఆట కట్టయింది. సరిహద్దులే ఆలంబనగా చేసుకుని ఇష్టారీతిన క్లబ్ నడిపిస్తున్న తీరుపై స్థానికంగా నిరసనలు వ్యక్తం కావడం, మీడియాలో వెలుగులోకి రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఆ పేకాట కేంద్రాన్ని మూయించారు. గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా ఆసరెల్లి శివారల్లో ఏర్పాటు చేసిన జూదం కేంద్రంపై పోలీసు యంత్రాంగం కన్నెర్రజేసింది.
షరా మామూలే…
సిరొంచ తాలుకాలో పేకాట క్లబ్బులు నిర్వహించడం మీడియాలో రాగానే మూయించడం అక్కడి పోలీసు అధికారులకు రివాజుగా మారిపోయింది. గత రెండేళ్లుగా క్లబ్బులను మూయించే పనిలోనే సిరొంచ సబ్ డివిజన్ పోలీసులు పనిగా పెట్టుకున్నారంటే ఇక్కడ పేకాట నిర్వహణ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. సిరొంచ, అంకీస, ఆసరెల్లి పరిసర ప్రాంతాల్లో నిర్వాహకులు క్లబ్బులు నడిపించడం, మీడియాలో వెలుగులోకి రావడం, పోలీసులు క్లోజ్ చేయించడం కామన్ గా మారిపోయింది. రోజూ లక్షలాది రూపాయల్లో టర్నోవర్ అవుతున్నాయని, వీకెండ్స్ లో అయితే కోట్లకు చేరుకుంటోందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్న ఈ గేమింగ్ యాక్టును శాశ్వతంగా కట్టడి చేసేందుకు గడ్చిరోలి జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. క్లబ్ ల నిర్వహణతో సరిహద్దు తెలంగాణ ప్రాంత వాసులు అంతా సిరొంచ ఏరియాకు చేరుకుంటున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే గేమింగ్ యాక్టుపై సిరొంచ పోలీసులు దాడులు చేసి సరిపెట్టుకుంటున్నారు కానీ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సిరొంచ తాలుకాకు చెందిన ఓ నాయకుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మరో వ్యక్తి, పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి తరుచూ ఇక్కడ పేకాట క్లబ్ లను ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ అంశాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తుండడంతో అప్పటి వరకూ పేకాట క్లబ్ లను క్లోజ్ చేయించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిర్వహాకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మరో సారి క్లబ్ ఏర్పాటు చేసేందుకు సాహసించకుండా ఉండే విధంగా చొరవ తీసుకుంటే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పెద్దల పేర్లను వాడుకుంటూ…
ముంబాయిలోని సీఎం పేషీలో తమ వాల్లు జిల్లా అధికారులకు చెప్పారని క్లబ్ నిర్వహణకు ఆటంకాలు ఉండవంటూ ఓ సారి, ఏకంగా జిల్లా స్థాయి అధికారులే క్లియరెన్స్ ఇచ్చారని తమ క్లబ్ ఎవరూ మూసి వేయరంటూ మరోసారి, ఇలా మహారాష్ట్రలోని ముఖ్య నాయకుల పేర్లు చెప్తూ కాలం వెల్లదీయడం వీరికి అలవాటుగా మారిపోయింది. క్లబ్ కు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయంటూ చెప్తున్న నిర్వహాకులు కేవలం పేకాట కోసం మాత్రమే ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నారు..? రిక్రియేషన్ క్లబ్ అయినట్టయితే ఇతర గేమ్స్ ఏర్పాటు చేయకపోవడం, కుటుంబ సభ్యులు కూడా వచ్చి అక్కడ ఉండేందుకు అవసరమైన వాతావరణం కల్పించకపోవడం వంటి నిబంధనలు ఎందుకు అమలు చేయడం లేదో అంతు చిక్కకుండా పోతోంది. మహారాష్ట్రలో పలుకుబడి ఉన్న నాయకుల పేర్లు, జిల్లా స్థాయి అదికారుల పేర్లు చెప్పుకుంటూ అక్రమంగా దందా కొనసాగిస్తున్న నిర్వహాకులపై కఠినంగా వ్యవహరించినట్టయితో రిపిట్ కాకుండా ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కూడా అయిన సిరొంచ తాలుకాలో పేకాట క్లబ్ నడిపిస్తుండడం వల్ల శాంతి భధ్రతల సమస్య కూడా ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నయాన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది.