దిశ దశ, న్యూ ఢిల్లీ:
వచ్చే ఏడాది జరగనున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన రూట్ మ్యాప్ ను కూడా తయారు చేశారు. బుధవారం న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట చేపట్టనున్న ఈ బస్సు యాత్ర ఈస్ట్ టు వెస్ట్ వరకు సాగనుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 14 నుండి మార్చి 20 వరకు సాగనున్న ఈ యాత్ర మణిపూర్ నుండి ముంబాయి వరకు సాగుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ కూడా ఆమోదించారని, ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నం అయినట్టు తెలిపారు. భారత్ జోడో యాత్ర స్పూర్తితో నిర్వహించ తలపెట్టిన ఈ యాత్ర 6,200 కిలో మీటర్ల మేర సాగనుందని ఈ సందర్భంగా మహిళలు, యువత, అణగారిన వర్గాల ప్రజలను కలుస్తారని తెలిపారు. మణిపూర్ లో మొదలయ్యే ఈ బస్సు యాత్ర నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపి, ఎంపి, రాజస్థాన్, గుజరాత్ మహారాష్ట్రల వరకు సాగుతుందని తెలిపారు. ముంబాయిలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న ఈస్ట్ టు వెస్ట్ ‘భారత్ న్యాయ యాత్ర’ ముగుస్తుందన్నారు.