తప్పించుకున్న పురుమళ్ల శ్రీనివాస్
కరీంనగర్ లో హాట్ టాపిక్
కరీంనగర్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారా..? అతని కోసం వేట ప్రారంభించారా..? ఉన్నట్టుండి ఆయన అదృశ్యం అయ్యారా..? కరీంనగర్ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది. బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ కోసం ఆదివారం పోలీసు బృందాలు పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. ఆయన ఇంటిని చుట్టుముట్టినప్పటికీ ఆయన పోలీసుల కళ్లుగప్పి అదృశ్యం అయ్యారు. గతంలో కూడా ఇదే పద్దతిన శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు వదిలేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేఫథ్యంలో ఇప్పుడు మాత్రం ఆయన ఎందుకు తప్పించుకున్నారన్నదే అంతు చిక్కకుండా పోయింది. అయితే నెట్టింట మాత్రం పురుమళ్ల శ్రీనివాస్ లక్ష్యంగా వస్తున్న ట్రోల్స్ హాట్ టాపిక్ గా మారాయి. బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ పై 30 కేసులు ఉన్నాయంటూ ఓ జాబితాను, ఆయన ఫోటోను పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
పీడీ యాక్టు పెట్టేందుకా..?
అయితే బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ పై పీడీ యాక్టు పెట్టేందుకే పోలీసులు ఎంట్రీ ఇచ్చారన్న ప్రచారం మాత్రం కరీంనగర్ లో గుప్పుమంటోంది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను దృష్టిలో పెట్టుకుని పీడీయాక్టు అమలు చేసి జైలుకు తరలించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారని ఈ కారణంగానే సర్పంచ్ శ్రీనివాస్ తప్పించుకున్నాడన్న చర్చ సాగుతోంది. అయితే సర్పంచ్ శ్రీనివాస్ పై గతంలో కూడా పీడీ యాక్టు పెడ్తారని ప్రచారం జరిగినప్పటికీ అప్పటి పోలీసులు మాత్రం అతన్ని విచారించి హెచ్చరించి వదిలేశారు. కానీ ఇప్పుడు మాత్రం అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకోవాలని పోలీసు అధికారులు ఆదేశాలు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నదే కరీంనరగ్ లో హాట్ టాపిక్ గా మారింది.