కరీంనగర్ అభ్యర్థి వేటలో బీజేపీ..?

దిశ దశ, కరీంనగర్:

ఉత్కంఠ భరితమైన ఎన్నికల వాతావరణం నెలకొనే కరీంనగర్ లో ఈ సారి మాత్రం పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా కొత్త అభ్యర్ధి అన్వేషణ కూడా కొనసాగుతున్నట్టుగా సమాచారం.

టఫ్ ఫైట్ లేనట్టేనా..?

కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ నిలబడే అవకాశాలు ఉన్నాయని ఇంతకాలం ప్రచారం జరిగింది. జాతీయ నాయకత్వం కూడా ఎంపీలను ఎమ్మెల్యేలుగా నిలబెట్టాలని కూడా యోచించింది. ఈ విషయంపై పార్టీ అంతర్గతంగా చర్చించినట్టు కూడా కూడా పార్టీ వర్గాలు చెప్పుకున్నప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటన వెలువడలేదు. మరో వైపున టఫ్ ఫైట్ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్న క్రమంలో కరీంనగర్ నుండి బలమైన అభ్యర్థిని బరిలో నిలిపే యోచనలో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించాడని, ఈ సారి కూడా ఆయన్నే నిలబెట్టే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు వచ్చాయి. మైనార్టీ ఓటు బ్యాంకు కారణంగా సంజయ్ తక్కువ మెజార్టీతో ఓటమి పాలైనందున అధికార పార్టీ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మల్చుకున్నట్టయితే ఈ సారి సంజయ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా సాగింది. దీంతో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నిలబడడం ఖాయమని అటు పార్టీలో ఇటు కరీంనగర్ సమాజంలో డిసైడ్ అయిపోయింది. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో సంజయ్ కి బదులుగా ప్రత్యామ్నాయ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు బలమైన నాయకుడిని బరిలో నిలిపేందుకు కొంతమంది నాయకులు గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టు సమాచారం. పార్టీలో ఉన్న నాయకులను బేరీజు వేసుకున్న ముఖ్య నాయకులు ఇతర పార్టీలకు చెందిన వారితో మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం. చట్ట సభకు ప్రాతినిథ్యం వహించిన ఓ నేతతో ఇప్పటికే పార్టీ వర్గాలు మంతనాలు జరుపుతున్నట్టుగా కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సదరు నేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే ఆయనకే కరీంనగర్ బీజేపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో బండి సంజయ్ అభ్యర్థిగా ఉన్నట్టుగా గట్టి పోటీ ఉంటుందా లేదా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం ఏ విషయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా పావులు కదుపుతుండడం… ఈ విషయం బయటకు లీక్ కావడంతో కరీంనగర్ బీజేపీలో తెరపైకి వచ్చే కొత్త నేత ఎవరోనన్న అంశమే హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page