దిశ దశ, అంతర్జాతీయం:
సాంకేతిక విప్లవానికి కేరాఫ్ గా నిలిచే దేశాల్లో ఒకటైన జపాన్ విమానయానాలపై ఓ కత్తెర తీవ్ర ప్రభావాన్ని చూపింది. వినడానికి విచిత్రంగా ఉన్నా అక్షరాల ఇది నిజం. ఓ మాములు కత్తెర ఏకంగా 200 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితిని తెచ్చిపెట్టింది.
ఎయిర్ పోర్టు…
జపాన్ లోని హక్కైడో ద్వీపంలోని న్యూ చిటోస్ ఎయిర్ పోర్టులో కత్తెర ఓ అలజడినే సృష్టించింది. స్థానికంగా ఉన్న ఓ రిటైల్ స్టోర్ లో ఆగస్టు 17న ఓ కత్తెర కనిపించకుండా పోయింది. దీంతో రిటైల్ స్టోర్స్ యాజమాన్యం ఈ విషయాన్ని విమానయాన అధికారులకు తెలియజేశారు. దీంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు హై అలెర్ట్ అయ్యారు. విమానశ్రయం అంతా గాలించడంతో పాటు ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కత్తెర మిస్సయిన విషయంపై స్పష్టత రాకపోవడంతో 36 విమాన సర్వీసులను రద్దు చేయగా, 201 విమానాలను ఆలస్యంగా నడిపించాల్సి వచ్చింది. దాదాపు 2 గంటల పాటు కత్తెర కోసం విమానశ్రయ సెక్యూరిటీ ఫోర్స్ సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అయినా దాని ఆచూకి మాత్రం దొరకకపోవడంతో అధికారయంత్రాంగం అంతా హైరానా పడిపోయింది. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి ఈ కత్తెర చేరి వారు విమానాల్లో ప్రయాణిస్తున్న క్రమంలో ఆయుధంగా మల్చుకునే ప్రమాదం ఉందని భావించిన అధికారులు కత్తెర కోసం స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టక తప్పలేదు. భద్రతా చర్యల్లో భాగంగా కత్తెర మిస్ అయిన విషయంపై సెర్చింగ్ చేయాల్సి వచ్చిందని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.
ట్విస్ట్ ఏంటంటే…
స్టోర్స్ యజమాని ఇచ్చిన సమాచారంతో ఎయిర్ పోర్ట్ అంతా హై అలెర్ట్ కాగా… చివరకు ఈ సీజర్ ఎక్కడ దొరకిందంటే మిస్సయిందని చెప్పిన స్టోర్స్ లోనే. సదరు స్టోర్స్ మేనేజ్ మెంట్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే కత్తెర మిస్సయిన విషయంపై క్లారిటీ లేకుండా పోయిందని అధికారులు వివరించారు. ఎట్టకేలకు కత్తెర లభ్యం కావడంతో విమాన సర్వీసులు యథావిధిగా మొదలయ్యాయి. అయితే విమానాలు ఆలస్యంగా నడవడం… కొన్ని రద్దు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు కూడా.