దిశ దశ, కరీంనగర్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలిమినేషన్ రౌండ్, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంటే ఏంటీ..? సాధారణ ఎన్నికల లెక్కింపునకు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు తేడా ఏంటీ..? లీడ్ వచ్చినా ప్రథమ స్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటించకపోవడానికి కారణాలు ఏంటీ..? ఇప్పుడిదే చర్చ సర్వత్రా జరుగుతోంది.
లెక్కింపు ఇలా…
మండలిలో వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులకు ప్రాతినిథ్యం కల్పించాలన్న సంకల్పంతో చేపట్టిన విధానం. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, సేవ కార్యక్రమాలు, కళా రంగంలో ఉన్నవారు, ఎమ్మెల్యేలు వంటి విధానాలతో మండలి సభ్యులను ఎన్నికునే విధానం అమల్లో ఉంది. ఇందులో కళారంగం, సేవా రంగాలకు సంబంధించిన వారి పేర్లను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపించినట్టయితే వారి గురించి వివరాలు సేకరించిన గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత వారిని శాసన మండలి సభ్యులుగా ప్రకటిస్తారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునే విధానానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రక్రియలో గెలిచిన వారు మండలిలోకి అడుగు పెట్టే అవకాశం ఉండగా, టీచర్లకు సంబంధించి, పట్టభద్రులకు సంబంధించిన నియోజకవర్గాల ద్వారా ఎన్నుకున్న వారికి కూడా మండలిలో చోటు దక్కుతుంది. అయితే ఉపాధ్యాయ, పట్టభద్రులు ఎన్నకునే విధానంలో జరిగే కౌంటింగ్ తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత కౌంటింగ్ జరిపే ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
50శాతానికి పైగా…
టీచర్లు, పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 50శాతానికి పైగా ఓట్లు సాధించాల్సి ఉంటుంది. వీరికి ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఇలా ఓటరు తనకు నచ్చిన విధంగా బ్యాలెట్ పేపర్ల్ వారి పేర్ల పక్కన నంబర్ వేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పుడు ముందు చెల్లని ఓట్లను తీసి, 25 బ్యాలెట్ పేపర్లకో బెండిల్ కడ్తారు. ఆ తరువాత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించి 50 శాతం పైగా ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ తొలి ప్రాధాన్యతలో స్పష్టమైన మెజార్టీ రానట్టయితే రెండో ప్రాధాన్యతతో పాటు ఎలిమినేషన్ రౌండ్ కొనసాగిస్తారు. ఇందులో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటును తొలగించి రెండో ప్రాధాన్యత కింద వచ్చిన ఓట్ల వివరాలు సేకరించి వాటిని సదరు అభ్యర్థికి తొలి ప్రాధాన్యత ఓట్లతో కలుపుతారు. ఇలా ఎలిమినేషన్ రౌండ్, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏక కాలంలో సాగుతుంటుంది. 50 శాతానికి పైగా ఓట్లు వచ్చే వరకు కూడా ఈ విధానం కొనసాగుతూనే ఉంటుంది. కరీంనగర్ టీచర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తొలి ప్రాధాన్యత ఓట్లలోనే 50 శాతానికి పైగా సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. కానీ పట్టభద్రుల విషయానికి వస్తే మాత్రం తొలి ప్రాధాన్యత ఓట్లో ఏ ఒక్క అభ్యర్థికి 50 శాతం దాటకపోవడంతో ఎలిమినేషన్ రౌండ్, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. 54 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసి వారి బ్యాలెట్ పేపర్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఏఏ అభ్యర్థులకు వచ్చాయో వాటిని వారి తొలి ప్రాధాన్యత ఓట్లతో కలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రక్రియ ద్వారా జరిగిన లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 249, కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 186, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 224 ఓట్లు వచ్చాయి. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ కొనసాగుతున్నందున మరింతమంది అభ్యర్థుల పేర్లను కూడా తొలగించనున్నారు. ఆయా అభ్యర్థుల బ్యాలెట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు 10 వేల వరకు హరికృష్ణకు వచ్చినట్టయితే ఆయన రెండో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. లేనట్టయితే అవరోహణ క్రమంలో కొనసాగే ఎలిమినేషన్ రౌండ్ లో ప్రసన్న హరికృష్ణ బ్యాలెట్ పేపర్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించి వాటిలో ఏ అభ్యర్థికి ఎక్కువగా వచ్చినట్టయితే ఆ అభ్యర్థి కోటాలో జమ చేస్తారు. అప్పటికీ 50 శాతం ఓట్లు అంజిరెడ్డికి కానీ నరేందర్ రెడ్డికి కానీ రానట్టయితే మూడో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణం కూడా ఇదే. అయితే సాధారణ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తాయని అంచనా వేసే అవకాశం ఉండదన్నది వాస్తవం. కొన్ని సందర్భాల్లో రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఓట్లతో కూడా అభ్యర్థుల తలరాతలు మారే అవకాశం కూడా ఉంటుంది.